శ్రీరాముడు దర్శించుకున్నక్షేత్రం

శ్రీరామలింగేశ్వరాలయం
తెలంగాణలో ప్రాచీన పుణ్యక్షేత్రంగా, ప్రకృతి రమణీయతతో ఎత్తయిన గుట్టలపై వెలసిన దేవాలయం, ఐదువందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీనశివక్షేత్రంగా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దర్శించుకుని పాపనివారణ పొందిన ఆలయంగానూ ఈ దేవాలయం ప్రసిద్ధి. భక్తుల కొంగుబంగారమై స్వయంభువుగా వెలసిన శ్రీరామ లింగేశ్వరాలయం ఈ వారం దర్శనం. - బక్క బాబురావు, సెల్: 9299300913

ఎక్కడ ఉంది? జిల్లా కేంద్రమైన మేడ్చల్ గ్రామంలో ఉంది.

ఎలా వెళ్లాలి? సికింద్రాబాద్ నుంచి 15 కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉంది. సికింద్రాబాద్ నుంచి 229 నంబర్ ఆర్టీసీ బస్సులో మెడ్చల్ వెళ్లాలి. గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉంటుంది. గ్రామం నుంచి రైల్వే గేటు చేరుకుని పక్కనే ఎత్తయిన కొండపై వెలసిన ఆలయానికి చేరుకోవచ్చు.
ప్రత్యేకత: ఈ దేవాలయంలోని శివలింగం ఉత్తరాయణకాలంలో నిటారుగా, దక్షిణాయానంలో ఒకవైపు వంగినట్లు కనిపిస్తుంది. ఒక పెద్ద రాయిని తొలచి ఆలయాన్ని నిర్మించడం వల్ల ఎలాంటి పిల్లర్ల ఆధారం లేకుండా వుండి రాయి లోపలే ఆలయం ఉన్నట్లు కనిపిస్తుంది.

స్థల విశిష్టత: పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతంగా ఉండి, పెద్దపెద్ద రాతిగుండ్లతో ఉండేది. ఋషులు, మునులు ఈ గుట్టపై తపోదీక్ష చేసి పరమశివుని సాక్షాత్కరింపజేసుకునేవారట. అలా ఆ శివుడే స్వయంభులింగ రూపంలో వెలిశాడని చెబుతారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం ఈ గుట్టపై వెలసిన పరమశివున్ని దర్శించుకుని బ్రహ్మ హత్యపాతకనివారణ పొందాడని, శ్రీరాముడు దర్శించడం వల్ల శ్రీరామలింగేశ్వరుడిగా పేరొచ్చిందని శాసనాలు చెబుతున్నాయి.

సుమారు 450-500 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం జరిగినట్లు చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ధాత్రిక రాజలింగం అనే జాగీర్దార్ వుండేవాడు. అధ్యాత్మిక, దైవభక్తి మెండుగా ఉన్న ఆయనకు ఒకరోజు శ్రీరామలింగేశ్వరుడు కలలో కనిపించి ఆలయ నిర్మాణం కావించమని, పూజలు చేస్తే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆదేశించారట. దీంతో ఆయన చాలా అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.

ఉత్సవాలు: ప్రతీ సోమవారం అర్చన, అభిషేకాలు, హారతితోపాటు అన్నదాన మహాప్రసాదం నిర్వహిస్తారు. కార్తీక, శ్రావణ మాసాల్లో, మహాశివరాత్రి పర్వదినాన విశేష పూజలు జరుగుతాయి. స్వామివారి సన్నిధిలో 41 రోజులు శివదీక్ష చేస్తారు. వారికి భోజన వసతి కల్పించబడుతుంది. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమివరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నందీశ్వర, భృంగీశ్వర హంసవాహన, గజవాహన, అశ్వవాహన సేవలు నిర్వహిస్తారు.

ఉప ఆలయాలు: శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ వీరభద్రేశ్వరస్వామి, శ్రీ కాశీ విశ్వనాథస్వామి, శ్రీ రంగ నాయకుల స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటి ఉప ఆలయాలు ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ప్రాచుర్యంలోకి రావాలి

ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. గత పాలకుల నిర్వాకం వల్ల ప్రాచుర్యానికి నోచుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రమేర్పడినంక మన ఆలయాలు, మన ప్రాచీన, కట్టడాలు గుర్తింపుకు నోచుకుంటున్నాయి. శ్రీరామలింగేశ్వరాలయం మరింత ప్రాచుర్యం పొంది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. -మనోహరస్వామి, ఆలయ అర్చకులు

అందరి సహకారం కావాలి

మా పూర్వీకులు ఆలయాన్ని నిర్మించి తరతరాలుగా ధర్మకర్తలుగా, కార్యనిర్వాహకులుగా సేవలందిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా శ్రీరామలింగేశ్వరుడి అనుగ్రహంతో సేవ చేసే భాగ్యం లభించింది. ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో భక్తులకు అధ్యాత్మిక సేవలందించే ప్రాచీన శైవక్షేత్రమిది. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయం ఇంకా అభివృద్ధి కావలసిన అవసరం ఉంది. దీనికి అందరి సహకారాలు అవసరం. -ధాత్రిక కాశీనాథ్, ధర్మకర్త, ఆలయ నిర్వాహకులు