శ్రావణ పాయసాలు!

శ్రావణమాసం.. పండుగల మాసం.. రోజూ ఒక పూజలా సాగిపోతుంది.. మరి నైవేద్యానికి తియ్యని పాయసాలు లేకపోతే ఎలా? అందుకే తీరొక్క పాయసాన్ని వండాం.. ఆ దేవదేవుళ్లను తలుస్తూ.. భక్తితో నైవేద్యం సమర్పించి.. వేడివేడిగా పాయసాలను ఆరగించేయండి..

ఆనిగెపు కాయ పాయసం

కావాల్సినవి :

ఆనిగెపు కాయ : పావు కిలో, పాలు : పావు లీటరు, కోవా : 50 గ్రా., చక్కెర : 100 గ్రా., బాదం : 5, పిస్తా : 5, నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్

తయారీ :

ఆనిగెపు కాయను చెక్కు తీసి గింజలు లేకుండా తురుముకొని పక్కన పెట్టాలి. గిన్నెలో నెయ్యి వేసి దాంట్లో తురిమిన ఆనిగెపు కాయ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. దీన్ని పక్కన పెట్టి అదే గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. మరుగుతున్న పాలల్లో వేయించిన సొరకాయ తురుము వేసి కలుపాలి. ఇప్పుడు కోవా, చక్కెర వేసి సన్నని మంట మీద కలుపుతుండాలి. చిక్కబడేంత వరకు ఉంచి బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి దించేయాలి. వేడిగా లాగించేస్తే యమ టేస్టీగా ఉంటుంది.

స్వీట్ పొటాటో పాయసం

కావాల్సినవి :

స్వీట్‌పొటాటో : 250 గ్రా. పాలు : 500 మి.లీ. చక్కెర : 100 గ్రా. యాలకుల పొడి : అర టీస్పూన్ బాదం : 4 పిస్తా : 4 జీడిపప్పు : 4 నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్

తయారీ :

స్వీట్ పొటాటోని చెక్కు తీసి శుభ్రంగా కడుగాలి. కాస్త ఆరిన తర్వాత తురిమి పక్కన పెట్టాలి. గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో తురిమిన స్వీట్‌పొటాటో మిశ్రమాన్ని వేసి దోరగా వేయించాలి. అవి కాస్త రంగు మారాక పాలు పోసి జాగ్రత్తగా కలుపుతుండాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాలు ఉంచి చక్కెర, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు కలుపాలి. ఈలోపు చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తాలను కొద్దిగా వేయించి ఉడుకుతున్న మిశ్రమంలో పోసి దించేయాలి. రుచికరమైన స్వీట్ పొటాటో పాయసం రెడీ!

క్యారెట్ పాయసం

కావాల్సినవి :

క్యారెట్ : 250 గ్రా., పాలు : 500 మి.లీ., నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, చక్కెర : 100 గ్రా., తర్బుజా గింజలు : 50 గ్రా., జీడిపప్పు : 5, బాదంపప్పు : 5, పిస్తాపప్పు : 5

తయారీ :

క్యారెట్‌ని శుభ్రం చేసి చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. నెయ్యిలో తర్బుజా గింజలు వేసి వేయించాలి. దాంట్లోనే మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలోనే బాదం, పిస్తా, జీడిపప్పులను వేయించాలి. ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. ఇందులో క్యారెట్ తురుము వేసి కలుపాలి. దీంట్లో తర్బుజా గింజాలు, చక్కెర వేసి సన్నని మంట పై చిక్కబడే వరకు ఉడికించాలి. గిన్నె దించి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పులను వేసి గార్నిష్ చేయాలి. టేస్టీ క్యారెట్ పాయసం పొగలు కక్కుతూ నోరూరిస్తుంది.

సగ్గుబియ్యం పాయసం

కావాల్సినవి :

సగ్గుబియ్యం : 50 గ్రా. , సేమియా : 50 గ్రా., పాలు : 500 మి.లీ., కండెన్స్‌డ్ మిల్క్ : 100 మి.లీ., మిరియాల పొడి : పావు టీస్పూన్, చక్కెర : 100 గ్రా., నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్, జీడిపప్పు : 10, కిస్‌మిస్ : 10

తయారీ :

సగ్గుబియ్యం కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌లను దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే గిన్నెలో సేమియా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. దీంట్లో సగ్గుబియ్యం వేసి ఇవి బాగా ఉడికిన తర్వాత సేమియా వేసి కలుపాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి కండెన్స్‌డ్ మిల్క్ పోసి, చక్కెర, మిరియాల పొడి వేసి కలుపాలి. కాస్త చిక్కబడ్డాక ఇందులో వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గార్నిష్ చేసి దించేయాలి.

గుమ్మడికాయ పాయసం

కావాల్సినవి :

గుమ్మడికాయ : పావు భాగం, పాలు : అర లీటరు, చక్కెర : రుచికి సరిపడినంత, సొంఠి పొడి : అర టీస్పూన్, నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, డ్రైఫ్రూట్స్ : గార్నిష్ కోసం

తయారీ :

గుమ్మడికాయ చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసి దాంట్లో తురిమిన గుమ్మడికాయ దోరగా వేయించాలి. ఇది కాస్త వేగాక పాలు పోయాలి. సన్నని సెగ మీద కలుపుతూ ఉడుకనివ్వాలి. ఇప్పుడు చక్కెర వేసి అలాగే కలుపుతుండాలి. శొంఠిపొడి వేసి కలిపి దించేయాలి. మనకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి వేడిగా వడ్డిస్తే చాలు. టేస్టీ గుమ్మడికాయ పాయసం మీ ముందుంటుంది. జి.యాదగిరి కార్పొరేట్ చెఫ్ వివాహ భోజనంబు రెస్టారెంట్ జూబ్లీహిల్స్, హైదరాబాద్ పార్క్‌లైన్, సికింద్రాబాద్