రానాతో జోడీగా..

ఫిదా చిత్రంతో యువతరం కలలరాణిగా భాసిల్లింది తమిళ సోయగం సాయిపల్లవి. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ అమ్మడు కథాంశాల పరంగా వైవిధ్యానికి పెద్దపీట వేస్తోంది. తన పాత్ర చిత్రణలో నవ్యత ఉంటేనే సినిమాకు ఓకే చెబుతోంది. అందుకే సాయిపల్లవిని ఒప్పించడం మామూలు విషయం కాదని చెబుతారు. తాజాగా ఈ సొగసరి తెలుగులో మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రానా కథానాయకుడిగా నటించనున్నారు. నీది నాది ఒకే కథ చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. పిరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. కథలోని కొత్తదనం, పాత్ర చిత్రణలోని భావోద్వేగాలు నచ్చడంతో ఈ సినిమాను సాయిపల్లవి అంగీకరించిందని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు విరాటపర్వం 1992 అనే పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం సాయిపల్లవి పడి పడి లేచె మనసు చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా నటిస్తున్నది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకులముందుకురానుంది.