వెయ్యి పాటల చాలెంజ్

స్వప్న అబ్రహాం. 47 ఏళ్ల దుబాయ్ సిటిజన్. కేరళలోని కొట్టాయంకు చెందిన స్వప్న దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. గత ఇరవై నాలుగేళ్లుగా సంగీతంలో ఆరితేరారు. మ్యూజిక్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి.. ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె వెయ్యి పాటల చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.

సంగీతమే ఆమె శ్వాస. పాటలే ఆమె ప్రాణం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాక రకరకాల పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది. దుబాయ్ సాంస్కృతిక.. విజ్ఞాన మంత్రిత్వ శాఖలో కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. సంగీతమే జీవితంగా భావించే స్వప్న.. ఆ సంగీతంలో చెరిగిపోని రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వెయ్యి రోజుల్లో వెయ్యి పాటలు పాడటాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నది. పాటలంటే ఎవరో రాసినవి పాడటం కాదు. స్వయంగా ఆమెనే రాస్తుంది. ఆమెనే సంగీతం సమకూరుస్తుంది. పాడుతుంది. ఇలా ప్రతీరోజు రెండు పాటలు పూర్తి చేస్తున్నది. ఇప్పటికి 500 రోజులు అయిపోయాయి. ఆగస్టు 20 నాటికి 500 పాటలు పూర్తి చేసుకున్నది. మిగతా 500 పాటలు పూర్తిచేసుకొని అనుకున్నది సాధించాలన్నది ఆమె కోరిక. దీనికోసం ఆమె కఠోర సాధన చేస్తున్నది. ప్రతిరోజు రాత్రి 8:30 గంట నిద్రపోతుంది. తెల్లవారుజామున 3:30 గంటలకే నిద్రలేచి పాటలు రాస్తుంది. తర్వాత వాటిని సంగీతానికి అన్వయిస్తూ.. మధురంగా పాడుతూ తన అధికారిక వెబ్‌సైట్లో లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. 2020లోగా ఈ చాలెంజ్ పూర్తిచేస్తాననే ధీమాతో ఉన్నది స్వప్న.