వృక్షాబంధన్!

రాఖీ కట్టి అన్నయ్య బాగుండాలని కోరుకుంటాం. చెల్లెల్ని దీవిస్తాం. స్వీట్లు తినిపించుకుంటాం. పండుగ చేసుకుంటాం. మన బంధాలు, బంధుత్వాలు బాగుండాలని వేడుకలు జరుపుకొంటున్నాం. మరి మనల్ని కాపాడే ప్రకృతి గురించి ఏం చేస్తున్నాం? అందుకే ఈ ఏడాది చేసుకుందాం వృక్షాబంధన్..

వర్షమొస్తే గొడుగవుతుంది. వయసొస్తే కట్టెగా తోడవుతుంది. ఎండొస్తే నీడవుతుంది. ఈ లోకాన్ని విడిచాక కూడా కట్టెగా మారి కాల్చేస్తుంది. సూర్యుడి నుంచి రక్షిస్తుంది. కాలుష్యం నుంచి కాపాడుతుంది. కార్బన్ డై యాక్సైడ్ స్వీకరించి ఆక్సిజన్‌నిస్తుంది. అయినా మనం చెట్లను నరుకుతున్నాం. ఇంత చేస్తున్న చెట్టు గురించి మనమేం చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఫలితంగా దాని మనుగడ లేకుండా చేస్తున్నాం.

మానవాళికి రక్షగా నిలుస్తున్న వృక్షాన్ని కొట్టేస్తున్నాం. మీ అన్నయ్య, తమ్ముళ్లతో పాటు జీవకోటిని కాపాడుతున్న మొక్కకు ఈ ఏడాది రాఖీ కట్టండి. కుటుంబ సభ్యునిగా మొక్కని కాపాడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతలను భుజాల మీద వేసుకోండి. ఇంటి సభ్యులకు రాఖీ కట్టడమే కాదు. ఇంటి ముందున్న మొక్కకు రాఖీ కట్టి దాని మంచి చెడులను చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయండి. ఈసారి నుంచి రక్షాబంధన్‌తో పాటు వృక్షాబంధన్‌ను ప్రారంభించండి. భవిష్యత్తు తరాలను కాపాడుకోండి.