వీధి నాటికలతో చైతన్యం

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అవగాహన కల్పించి, అందర్నీ ఏకం చేసింది వీధి నాటకాలే. ఆ కళను ఆధారంగా చేసుకొని అహ్మదాబాద్‌కు చెందిన కళాకారిణి ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర రోగాలపై చైతన్యం కల్పిస్తున్నారు.

సమాజంలో అనారోగ్య సమస్యలపై చైతన్యవంతులను చేయడానికి ప్రముఖ నృత్యకళాకారిణి మల్లికా సారాభాయ్ శ్రీకారం చుట్టారు. తన ప్రదర్శనల ద్వారా ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తున్నారు. దేశంలో డాక్టర్లు, యాక్టర్లు కలిసి ప్రజారోగ్యంపై ప్రత్యేక ప్రదర్శనలివ్వడానికి ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో వైద్యులు, యువ కళాకారులు, వీధి నాటికలతో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు. మన దేశంలో వైద్యులు, నాటక రంగ కళాకారులు కలిసి పని చేస్తున్న మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. అహ్మదాబాద్‌లో మల్లిక నిర్వహించే దర్పణ స్కూల్ ఆఫ్ పర్ఫామింగ్ ఆర్ట్స్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాల సంయుక్తాధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. టీమ్ అంతా పలు కోణాలలో పరిశోధించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నడుంబిగించారు. ఇందుకు పలు వర్క్‌షాప్‌లను నిర్వహించి, ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసి, నాటక రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తున్నారు. వ్యాధులతో పాటుగా, ఆత్మహత్యలు, మానసిక, శారీరక రుగ్మతలపై కూడా దృష్టిసారించారు. లైంగికవిద్యపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య సూత్రాలతోపాటు సంస్కృతీ, సంప్రదాయాల గురించి వివరించేందుకు ఈ బృందం తీవ్రంగా కృషి చేస్తున్నది.

Related Stories: