విమానాన్ని వెంబడించిన పక్షులు!

బాల్డ్ ఐబస్ పక్షులను చూస్తే కొంతమందికి భయమేస్తుంది. వీటి కళ్లు, ముక్కు, ఆకారం అలా ఉంటాయి. అయితే ఇవి ఓ విమానాన్ని దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర వెంబడించాయి.

ప్రస్తుతం అంతరించిపోయే దశలో బాల్డ్ ఐబస్ పక్షులను కాపాడేందుకు ఓ బృందం వినూత్న ఆలోచన చేసింది. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వాటి గుంపులోని పెద్ద పక్షిని విమానంలో ఎక్కించుకోవడంతో.. దానిని కాపాడేందుకు మిగతా పక్షులు దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర విమానాన్ని వెంబడించాయి. ఈ ప్రయాణంలో రెండు పెద్ద పర్వతాలను కూడా దాటాయి. పెద్ద పక్షిని కాపాడుకునేందుకు ఇవి చేసిన సాహసాన్ని ఆ బృందం కెమెరాలో బంధించింది. ఒకప్పుడు మధ్య యూరప్‌లో ఈ పక్షి జాతి పర్యాటకులు, స్థానికులకు కనువిందు చేశాయి. అయితే వీటికి జ్ఞాపకశక్తి చాలా తక్కువట. ఇవి యూరప్ అడవుల నుంచి వెళ్లిపోయి, తిరిగివచ్చే దిశను పూర్తిగా మర్చిపోయాయి. దీంతో పక్షిప్రేమికులు ఇలా సాహసానికి ఒడిగట్టారు. విమానంతో పాటు వచ్చిన బాల్డ్ ఐబస్ పక్షుల జాతిని వృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు.