విచిత్ర విరించి

అక్షరాలను కుదురుగా.. గుండ్రంగా.. ముత్యాల్లా రాయడం ఒక కళ. సాధనచేస్తే ఎవరికైనా ముత్యాల్లాంటి రాత సాధ్యమే. కానీ.. పెన్ను ఎత్తకుండా ఒకే పేరు ముత్యాల్లా రాయడం, తిరిగేసినట్టుగా రాయడం సాధ్యమేనా? చాలామంది ఈ ప్రశ్నకు అసాధ్యమనే సమాధానమిస్తారు. కానీ.. కొంతమంది అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు. అలాంటి వారిలో.. సత్య తిరునగరి ఒకరు. ఆయన ప్రత్యేకత ఏంటంటే? -మ్యాకం రవికుమార్ చేతిరాతతో ప్రత్యేకతను సంతరించుకోవడమేగాక అనేకానేక రికార్డులను సొంతం చేసుకున్నారు సత్య తిరునగరి. ప్రధాని నుంచి మొదలు ఎందరో ప్రముఖులను అబ్బురపరిచి వారి మన్ననలు పొందారు. జాతీయ.. అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఒక్క చేతిరాతలోనే కాదు.. ఫొటోలను తీయడంలోనూ.. నెయిల్ ఆర్ట్‌లోనూ ప్రావీణ్యుడు. గుండ్రంగా.. కుదురుగా రాయడమే ఒక కళ. మరి అలాంటిది పెన్ను ఎత్తకుండా ఏకబిగిన రెండు గంటల పాటు.. ఎంత పెద్ద వాక్యాన్నైనా రాసేస్తాడు. అదీ డ్యూయల్ లైన్ పద్ధతిలో రాయడం తిరునగరి విశిష్టత. కాగితంపై పెన్ను పెట్టి రాయడం మొదలు పెట్టినప్పుడు ఆయన రాస్తున్నదేదో చూసేవాళ్లకు కూడా అర్థంకాదు. ఏవో గీతలు గీస్తున్నాడని అనుకుంటారు. కానీ రాయడం పూర్తయిన తర్వాత ఆయన ఏం రాశాడో చదివితే మాత్రం వావ్.. అనకుండా ఉండలేరు. మనసులోనే అక్షరాలను ఊహిస్తూ రాసుకుంటూ పోతూ చివరిదాకా వెళ్లాక మరలా అక్షరాలను వెనకనుంచి ముందుకు కలుపుతూ రాయడం సత్య శైలి. ఆయన చేత్తో రాసే అక్షరాలు కంప్యూటర్‌లో డిజైన్ చేసినట్టుగా అందంగా ఉంటాయి. ఇలా తెలుగు భాషలో మాత్రమే కాదు హిందీ ఇంగ్లిష్‌లతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ రాయగల సిద్ధహస్తుడు. అంతేకాదు.. రెండు వరుసల పద్ధతిలో ఒక వాక్యాన్ని కుడి నుంచి ఎడమకు.. ఎడమ నుంచి కుడికి.. పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి.. రాయగలడు. ఒక వాక్యానికి డ్రాప్‌షాడోను గీయడం మాత్రమే కాదు.. పుస్తకంలోని అక్షరాలు అద్దం ముందు పెట్టి చూస్తే.. ఎలా ఉంటాయో అలా ప్రతిబింబంలా కూడా క్షణాల్లో రాయగలడు.

ఆలోచన ఎలా వచ్చింది..?

ఇలా రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అని సత్యను ఎవరైనా అడిగితే.. నవ్వుతూ సమాధానమిస్తాడు. సత్య మూడో తరగతి చదువుతున్నప్పుడు గొలుసుకట్టు రాత రాయమని తోటి మిత్రులు సవాల్ విసిరారట. అలా సరదాగా డ్యూయల్ లైన్ రైటింగ్ మొదలుపెట్టాడు సత్య. మొదట్లో మూడు అక్షరాలను రాయడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అతికష్టం మీద మూడు అక్షరాలను రాశాడట. అలా రాయడంలో పట్టు సాధించాలని ప్రయత్నించాడు. ఎనిమిదో తరగతి వరకు అలా రాస్తూనే ఉన్నాడు. అప్పటికి రాతలో సత్య పట్టు సాధించాడు. డిగ్రీలో చేరేనాటికి ఎంత పెద్ద వాక్యాన్నైనా ఈజీగా డ్యూయల్ పద్ధతిలో రాసేస్తాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆ లిపికి విస్తృత ప్రచారం కల్పించాడు. డ్యుయల్ లైన్ రైటింగ్‌లోనే చిత్రలేఖనం, నెయిల్ ఆర్ట్ వేయడంలో పట్టు సాధించాడు. అనివార్య పరిస్థితుల్లో 13వ యేటనే కెమెరా చేతబట్టి ఫొటోగ్రాఫర్‌గా మారాడు. చిరకాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నాడు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు కూడా అందుకున్నాడు. జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను గీయడంలో సత్యది అందెవేసిన చెయ్యి. ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ రీసోర్స్ పర్సన్‌గా 23 జిల్లాల డ్రాయింగ్ మాస్టర్లకు ఆర్ట్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శిక్షణనిచ్చాడు. ప్రభుత్వం ప్రచురించి, విద్యార్థులకు ఉచితంగా పంచే పాఠ్యపుస్తకాల మీద బొమ్మలను వేశాడు.

ఎన్నో రికార్డులు..

విచిత్ర అక్షర లిపితో తిరునగరి అంతర్జాతీయస్థాయిలో రికార్డులు, అవార్డులను అందుకున్నాడు. 1999లో మొదటిసారిగా వండర్ వరల్డ్ సంస్థ విచిత్ర అక్షర శిల్పి టైటిల్‌ను ప్రదానం చేసి సత్కరించింది. 2000లో యునెస్కో ఇంటర్నేషనల్ సంస్థ యునెస్కో మిలీనియం విచిత్ర అక్షరశిల్పి టైటిల్‌ను అందజేసింది. 2010లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అప్పటి ప్రధాని చేతుల మీదుగా అందుకున్నాడు. తిరునగరి ఆవిష్కరించిన లిపికి 2012లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. ఇటీవల 2018లో రాష్ట్ర వయో విశిష్ట సమ్మాన్ అవార్డుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ విచిత్ర అక్షరలిపి తనతోపాటుగా అంతరించిపోవద్దనేది తిరునగరి అభిప్రాయం. అందుకే ఆయన ఆ లిపి మీద ఆసక్తితో ఎవరు వచ్చినా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. ఈ లిపిని కంప్యూటర్ ఫాంట్‌గా రూపొందించే దిశగా ప్రయత్నిస్తున్నాడు. తను వేసిన పెయింటింగ్స్‌ను, విచిత్ర అక్షర లిపిలో రాసిన సైన్ బోర్డులను సాలార్‌జంగ్ మ్యూజియంలో ప్రదర్శించేందుకు ప్రభుత్వ అనుమతిని కోరుతున్నాడు.

Related Stories: