అల్లు అర్జున్‌కు జోడీగా..?

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ సోయగం కైరా అద్వానీ. ఈ సినిమాతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కైరా ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆమె మరో ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదల తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా అంగీకరించలేదు. తదుపరి చిత్ర విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో కైరా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. హిందీ చిత్రం సోను కె టిటు కి స్వీటీ ఆధారంగా ఈ సినిమా వుంటుందని, డిసెంబర్ 11న ప్రారంభం కానుందని చెబుతున్నారు. అల్లు అరవింద్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం వుందని తెలిసింది.