వికటించిన ప్రయోగం

జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెండూ దూరంగా ఉంటామనటం ఆందోళనకరం. కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు రాజకీయ ప్రక్రియ నుంచి వైదొలుగటం 1950 దశకం నాటి పరిస్థితిని గుర్తుకుతెస్తున్నది. ఇప్పటికైనా కేం ద్ర ప్రభుత్వం, రాజకీయపక్షాలు కశ్మీర్ సమస్య విషయంలో ఏకాభిప్రాయంతో నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రక్రియలో కశ్మీరీలను భాగస్వామ్యం చేయటంలోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గుర్తించాలి.

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్న చందంగా తయారైంది జమ్ము కశ్మీర్ పరిస్థితి. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీ పీ) కూడా బహిష్కరిస్తుందని మెహబూబా ముఫ్తీ ప్రకటించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇంతకుముందే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించటం గమనార్హం. ఏడు దశాబ్దాలుగా రావణకాష్టంలా రగు లుతున్న కశ్మీర్ సమస్యకు పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితుల్లోనైనా పరిష్కా రం దొరుకుతుందని అందరూ ఆశించారు. కశ్మీర్ సమస్య విషయంలో తూర్పు-పడమరలుగా ఉండే పీడీపీ, బీజేపీ ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం ఆశావహదృక్పథంతో ప్రయత్నిస్తాయని అనుకున్నారు. కానీ జమ్ముకశ్మీర్ ప్రజలు, వారి ఆకాంక్షలు, అభిప్రాయాలకు అనుగుణమైన పాలన అందించటంలో విఫలమవటమే కాదు, సమస్యను మరింత విషమం చేశాయని అనిపిస్తున్నది. పీడీపీ-బీజేపీ సంకీర్ణప్రభుత్వం మూడేండ్ల పాలన జమ్ముకశ్మీర్ ప్రజాకాంక్షలకు అనుగుణంగా నడుచుకోలేదని తేటతెల్లం అయ్యింది. కామన్ మినిమ మ్ ప్రోగ్రాం భూమికగా పనిచేస్తామన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణప్రభుత్వం ప్రజలను మరింత దూరం చేసుకున్న దాఖలాలే కనిపించాయి. గతంలోకన్నా ఎక్కువగా ప్రజాందోళనలు, వేర్పాటువాద ఉద్యమాలు ఊపందుకున్నాయంటే, అది పార్టీల బాధ్యతారాహిత్యాన్నీ చాటిచెప్పటమే కాదు, ఓ చారిత్రక సదావకాశాన్ని జారవిడుచుకోవటంగా భావించకతప్పదు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక (స్వయం) ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌నే రద్దుచేయాలని వాదిం చే బీజేపీ, జమ్ముకశ్మీర్‌కు దానికున్న చారిత్రక ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో స్వయం ప్రతిప త్తి ఉండాలని చెప్పే పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం కశ్మీర్ చరిత్రలోనే ఓ మలు పు. కశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి రావటం అనేది ఊహకందనిది. అంతగా జమ్ముకశ్మీర్ సమాజం విభజనకు గురైంది. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న జమ్ములో బీజేపీ ప్రాబల్యం ఉంటే, కశ్మీర్ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు పెట్టని కోటగా ఉన్నది. అదే సామాజిక విభజన పునాదిగా బీజేపీ తగిన బలాన్ని కూడగట్టి పీడీపీతో కలిసి పాలనా పగ్గా లు చేపట్టింది. దీంతో కశ్మీర్ సమస్య మూలాల్లోకి వెళ్లి, కశ్మీర్ ప్రజల అనుమానాలు, భయా లు దూరంచేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి అడుగులు ముందుకువేయాల్సింది. కానీ ఇం దుకు భిన్నంగా పీడీపీ, బీజేపీ దేనికదిగా తమదైన రహస్య ఎజెండాతో పనిచేశాయా అనిపిస్తున్నది. ఏ ఒక్క సమస్యనూ సంకీర్ణ ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. నిరంతర సోదాలు, కూంబింగులు కశ్మీర్ ప్రజల్లో అసంతృప్తిని రాజేశాయనే అభిప్రాయం కూడా ఉన్నది. భద్రతా బలగాల బారి నుంచి వేర్పాటువాద నేతలను రక్షించేందుకు యువత రాళ్లువిసురుతూ రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకానొక దశలో పెద్దనోట్ల రద్దుకూడా స్టోన్‌పెల్టర్స్‌కు నిధులు అందకుండా చేయటానికేనని మోదీ ప్రభుత్వం చెప్పుకున్నది. అలాగే కథువా ఘటన, రంజాన్ సందర్భంగా విధించిన ఏకపక్ష కాల్పుల విరమణ కొనసాగించాలనడం పీడీపీ, బీజేపీల మధ్య అగాథం పెంచాయి. సీనియర్ జర్నలిస్టు షౌజత్ బుఖారీ హత్య కశ్మీర్ పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో పీడీపీతో మూడేండ్ల పొత్తుకు బీజేపీ చెల్లుచీటి చెప్పింది. ఈ క్రమంలోనే పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కూడా మూడేండ్ల బీజేపీ పొత్తు కషాయం మింగినట్లున్నదని ప్రకటించి తనదైన అసహనాన్ని ప్రకటించటం అనైక్యతను చాటుతున్నది.

కశ్మీర్ విషయంలో బీజేపీ దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించకపోగా, ఆర్టికల్- 35ఏతో తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. 35ఏ ఆర్టికల్ రాజ్యాంగబద్ధతపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కశ్మీర్ ప్రజలకు శాశ్వత పౌరసత్వం, ఆస్తు లు, ఉద్యోగాలు, చదువులు తదితర అంశాల్లో ప్రత్యేక సదుపాయాలు, అధికారాలను కట్టబెట్టే ఆర్టికల్-35ఏపై వివాదాన్ని తెరమీదికి తేవటం కశ్మీర్ ప్రజల్లో తీవ్ర అభద్రతాభావానికి గురిచే సింది. అంతేకాదు, 35ఏ ఆధారంగా పౌరసత్వాన్ని వివాదాస్పదం చేసి జనాభాలో మెజారిటీవాదాన్ని స్థిరీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కశ్మీరీలు ఆందోళన చెందుతున్నా రు. దీంతో కశ్మీర్‌లలో ఆందోళన మరింత రాజుకున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెండూ దూరంగా ఉంటామనటం ఆం దోళనకరం. కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు రాజకీయ ప్రక్రియ నుంచి వైదొలుగటం 1950 దశకం నాటి పరిస్థితిని గుర్తుకుతెస్తున్నది. ఇప్పటికైనా కేం ద్ర ప్రభుత్వం, రాజకీయపక్షాలు కశ్మీర్ సమస్య విషయంలో ఏకాభిప్రాయంతో నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రక్రియలో కశ్మీరీలను భాగస్వామ్యం చేయటంలోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గుర్తించాలి. ఈ సంక్షోభాన్నుంచి కశ్మీర్‌ను గట్టెక్కించడానికి కేంద్రం తక్షణం చొరవ చూపాలె.

More in ఎడిట్ పేజీ :