వింత పెండ్లిళ్లు - విచిత్ర ఆచారాలు

పెండ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు పెద్దలు. మరి ఆచారాలు? మనుషులు తమకు అనుగుణంగా తమ ఇంటి రాజ్యాంగంలో రాసుకున్నారు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఆ ఆచారాల్లో కొన్ని వింత చేష్టలూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉండే వివాహ ఆచారాలు చూస్తే ఔరా అని ముక్కు మీద వేలేస్కోవాల్సిందే.

నెల రోజుల కఠిన పరీక్ష

చైనాలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి నెల రోజుల ముందు నుంచి ఆ పెండ్లి కూతురు రోజుకో గంట తప్పకుండా ఏడ్వాల్సిందేనట. అంతేకాదు, పది రోజుల తర్వాత ఆ నవ వధువుకు తోడుగా వాళ్ల అమ్మ కూడా ఆ ఏడుపులో పాలు పంచుకోవాలి. మరో పది రోజుల తర్వాత ఆమెకు వాళ్ల అమ్మమ్మ తోడవుతుంది. నెల చివర్లో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో మహిళలంతా ఆమెకు సహాయంగా ఏడుస్తారు. అలా ఆడవారి ఏడుపుతో వచ్చే వివిధ రాగాలను పెండ్లి వారంతా ఆనందిస్తారట.

తిమింగలం దంతం!

ఫిజీ దేశంలో పెండ్లి కొడుకు అడిగే లాంఛనాలే వేరు. ఎక్కడైనా అమ్మాయితో పాటు నగోనట్రో పంపమంటారు. కానీ, అక్కడి పెండ్లి కొడుకు పిల్లనిచ్చే మామను అమ్మాయితో పాటు తిమింగలం దంతాన్ని అడుగుతాడట. మరి దాన్ని ఇచ్చి పిల్లకు పెండ్లి చేయాలంటే అమ్మాయి తండ్రి ఆస్తి మొత్తం అమ్మడం తప్పదేమో.

బెడ్రూమ్‌లోకి ఎంట్రీ

పెండ్లయ్యాక మొదటి రాత్రి తంతులో కొత్త దంపతులకు తోడుగా ఓ పెద్దావిడను బెడ్రూమ్‌లోకి పంపుతారట. ఈ వింత ఆచారం ఆఫ్రికాలోని కొన్ని పల్లెటూర్లలో ఉంది. ఆ పెద్దావిడ పెండ్ల్లి కూతురు తల్లి అయినా కావచ్చట.

నవ్వితే నో మ్యారేజ్

కాంగోలో పెండ్లి ఆచారం గమ్మత్తుగా ఉంటుంది. పెండ్లి తంతు ముగిసే వరకు పెళ్లి కొడుకు, పెండ్లి కూతురు నవ్వకూడదట. అలా నవ్వితే అరిష్టంగా భావించి వివాహమే రద్దు చేస్తారట.

ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు

స్వీడన్ దేశంలో ఓ వింత ఆచారం ఉంది. వెడ్డింగ్ రిసెప్షన్లో నవ దంపతులు కూర్చున్న చోటు నుంచి పక్కకు వెళితే చాలు. వారిని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చట. అమ్మాయో లేక అబ్బాయో వారి కుర్చీ నుంచి లేచి బాత్రూమ్‌కు వెళ్లినా సరే. అమ్మాయినైతే అక్కడి పురుషులు, అబ్బాయినైతే మహిళలు నిరభ్యంతరంగా ముద్దు పెట్టుకోవచ్చట.