ఒకరు పోతే ఇంకొకరు..

మిషాల్, శైలేష్ జైన్, హేమలత ప్రధాన పాత్రల్లో శుక్రా ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్.ఫణింద్ర రూపొందిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంజీవ్‌కుమార్ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్ నివ్వగా, నిర్మాత సంజీవ్‌కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ మంచి టీమ్ కుదిరింది. సరికొత్త కథతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఫణీంద్ర చెప్పిన కథ నన్నెంతగానో ఆకట్టుకుంది. హీరో మిషాల్ జైన్‌కు తొలి సినిమా ఇది. లఘు చిత్రాల్లో చూసి తనకు అవకాశం ఇచ్చాం. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొత్త కథతో చేస్తున్న సినిమా ఇది. సత్యప్రకాష్ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. ఒకరికి ఒకరు అనే ప్రేమలో ఒకరు పోతే ఇంకొకరు అనే ధోరణి మొదలైంది. దీనికి కారణమేంటి? అని ఆలోచనలోంచి పుట్టిన కథ ఇది. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వుంటుంది. ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయి. హర్ష ప్రవీణ్ చక్కని సంగీతం అందిస్తున్నారు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అలీ, ఎడిటింగ్: రామారావు.

Related Stories: