మార్చిలో సెట్స్‌మీదకు..

రంగస్థలం చిత్రంతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు సుకుమార్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సుకుమార్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మహేష్‌బాబు కథానాయకుడిగా సుకుమార్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. రంగస్థలం చిత్రాన్ని నిర్మించిన మైత్రీమూవీ మేకర్స్ తాజా చిత్రాన్ని తెరకెక్కించనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సుకుమార్ వినూత్నమైన కథాంశాన్ని సిద్ధం చేశాడని తెలుస్తున్నది. వాణిజ్య అంశాలు మేళవించిన నవ్యమైన ఇతివృత్తమని సమాచారం.అత్యంత భారీ వ్యయంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. గతంలో మహేష్‌బాబు-సుకుమార్ కాంబినేషన్‌లో 1 నేనొక్కడినే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం మహేష్‌బాబు మహర్షి చిత్రీకరణలో ఉన్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకురానుంది.