వంటగదే బ్యూటీ సెంటర్..

అందాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు మహిళలు రకరకాల రసాయన క్రీములు, మందులు వాడుతుంటారు. చర్మాన్ని నిత్య యవ్వనంగా చూసుకునేందుకు వంటిల్లే దివ్యమైన ఔషధాలయమని మాత్రం చాలామంది గుర్తించరు. అదెలా అంటారా..!
-పాల నుంచి తయారయ్యే యోగర్ట్ చర్మాన్ని సహజంగా మెరిపించడంలో సూపర్బ్‌గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రం చేయడానికి, కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. దీనిలో కొద్దిగా తేనెను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, వేడినీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. -వంటింట్లో ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టమాటాలు కూడా చర్మసంరక్షణకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి, చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి. టమాటా పచ్చలతో ముఖంపై కొద్దిసేపు రుద్ది, ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే, చర్మం నిగనిగలాడుతుంది. -బాదం, శాండిల్‌వుడ్ పౌడర్‌లను కలిపి చేసిన మిశ్రమాన్ని ముఖానికి పేస్ట్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే, చర్మం సహజత్వాన్ని పొందుతుంది. వీటిలో సహజంగా ఉండే విటమిన్లు, ప్రొటీన్లు చర్మకాంతికి దోహదం చేస్తాయి. -పొప్పడి ముక్కల్ని నుజ్జుగా చేసి, దానికి కొద్దిగా తేనె కలుపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. పొప్పడిలో ఉండే ఎంజైమ్‌లు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు చర్మంపై మృతకణాల్ని తొలగించి నిగారింపునిస్తాయి.