రేస్‌కారులో నింపే గాలేంటో తెలుసా?

మనం తిరిగే కార్లు, బైక్స్ ఇతర వాహనాల టైరల్లోకి సాధారణ గాలిని వాడతాం. మరి, ఇదే గాలిని రేస్‌కార్లలో కూడా వాడుతారా?

మన బైక్‌లో నింపే గాలిలో 78% నైట్రోజన్ , 21% ఆక్సిజన్, మిగతావి కొంచం నీటియావిరి కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. రేస్ కార్లలో మాత్రం పూర్తిగా నైట్రోజన్‌ని వాడుతారు. ఈ గ్యాస్ టైర్ రబ్బర్ నుండి తగ్గిపోవడానికి ఆస్కారం తక్కువ. అంటే నైట్రోజన్ గ్యాస్ ఎక్కువ సేపు టైర్‌లో ఉంటుంది. అలాగే టైర్‌ని స్థిరమైన స్థానంలో ఉంచుతుంది. టైర్ నిలకడైన ప్రదర్శన ఇస్తుంది. అలాగే తక్కువ సార్లు గ్యాస్ నింపుకోవాల్సి ఉంటుంది. రేస్ కార్లు చాలా వేగంగా వెళ్లడం వల్ల టైర్‌పైన చాలా ఒత్తిడి పడుతుంది. టైర్ కూడా చాలా వేడెక్కుతుంది. నైట్రోజన్ గ్యాస్ ఎంత వేడెక్కినా తక్కువ శాతం తన వైఖరిని మార్చుకుంటుంది. దీనివల్ల ఎక్కువ దూరం తక్కువ సమయంలో వెళ్లడానికి అవకాశం ఉంది. గాలి కన్నా నైట్రోజన్‌పై ఉష్ణ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్రోజన్‌ను వాడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే, రేస్ కార్లకు మామూలు గాలికి బదులుగా నైట్రోజన్‌ను నింపుతారు.