కొత్త కథతో సినిమా చేయడం సులభం!

దర్శకుడిగా వైవిధ్యమైన ఇతివృత్తాలతో సినిమాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తాను. అలాంటి సినిమాలే నాలో స్ఫూర్తిని నింపుతాయి. మరిన్ని మంచి కథలు రాయడానికి ప్రేరణనిస్తాయి. కార్తికేయ తర్వాత అలాంటి నవ్యానుభూతిని సవ్యసాచి అందించింది అని అన్నారు చందూ మొండేటి. కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తాజా చిత్రం సవ్యసాచి. నాగచైతన్య కథానాయకుడిగా నటించారు.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చందూ మొండేటి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ పాయింట్‌ను సినిమా కు ఎంచుకోవడానికి కారణమేమిటి?

ఓ స్నేహితుడి ద్వారా వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి విన్నాను. దాని గురించి తెలుసుకుంటున్న కొద్ది నాలో ఆసక్తి రెట్టింపైంది. ఈ సిండ్రోమ్ కలిగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు?వారికి ఎదురైన సమస్యలు తెలుసుకొని ఆశ్చర్యపోయాను. సిండ్రోమ్ లక్షణాల్ని పదిశాతం మాత్రమే సినిమాలో చూపించాం. తొలుత ఈ పాయింట్‌తో సినిమా చేయాలని అనుకోలేదు. నా మస్తిష్కంలో వేరే కథ ఉంది. దానికి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ పాయింట్‌ను జోడిస్తే బాగుంటుందని అనిపించింది. నా ఆలోచన విని నాగచైతన్య ప్రోత్సహించారు.

నాగచైతన్య పాత్ర ఎలా ఉంటుంది?

రెండు చేతులకు సమానమైన బలం కలిగిన యువకుడిగా నాగచైతన్య కనిపిస్తారు. ఎడమ చేయి అతడి నియంత్రణలో ఉండదు. దాని వల్ల ఎదురయ్యే పరిణామాలతో వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ఆయన పాత్ర సాగుతుంది. సాధారణంగా కొత్తపాయింట్‌తో సినిమాలు చేయడానికి హీరోలు సంశయిస్తుంటారు.ప్రేమకథలు చైతన్యకు మంచి పేరుతీసుకొచ్చాయి. లవ్‌స్టోరీస్ ఎంచుకొని అతడు చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని అందుకున్నాయి. అలాంటి కథే కావాలని అడగకుండా నేను చెప్పిన కొత్త అంశాన్ని నమ్మి ఈ సినిమా చేశారు.

ప్రతినాయకుడిగా మాధవన్‌ను తీసుకోవడానికి కారణమేమిటి?

హీరోకు ధీటుగా కథను నడిపించే కీలక పాత్రధారి కోసం మాధవన్‌తో పాటు మరో నలుగురి పేర్లు అనుకున్నాం. మాధవన్ సినిమాలన్నీ మూసధోరణికి భిన్నంగా ఉంటాయి. రెగ్యులర్ సినిమాలు ఆయన చేయలేదు. అది నమ్మే ఆయనకు ఈ కథ వినిపించాను. వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పారు. ఆయన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే కీరవాణి బాణీలు అందించడానికి ఒప్పుకోవడంతో మరో మెట్టు ఎక్కినట్లుగా ఫీలయ్యాను.

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎవరిది?

రీమిక్స్ ఆలోచన నాదే. ప్రథమార్థం మొత్తం సినిమా సరదాగా సాగుతుంది. ద్వితీయార్థం భావోద్వేగభరితంగా సీరియస్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ద్వితీయార్థంలో పాట పెడితే బాగుంటుందని అనిపించి లగాయిత్తు పాటను రీమిక్స్ చేశాం.

నాగార్జునకు వీరాభిమానని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన మేనరిజమ్స్ ఏమైనా చైతూలో చూపించే ప్రయత్నం చేశారా?

కథను నమ్మి చేసిన సినిమా ఇది. అక్కినేని అభిమానులను అలరించడానికి నాగార్జునలోని చిన్న చిన్న హావభావాల్ని, చమక్కులను చైతూ ద్వారా చూపించాం. వారసుల ద్వారా స్టార్ హీరోల డైలాగ్‌లు, సన్నివేశాలు, పాటలు చూపిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.అలాగని కథలో సంబంధంలేకపోయినా చూపించడం సరికాదు.

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది అరుదైన పాయింట్. దానిని ప్రేమకథతో జోడించి చెప్పడం కష్టంగా అనిపించలేదా?

కొత్త పాయింట్ ఏమీ కాదిది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌ను మేము కనిపెట్టలేదు. మా కథకు సరిపోయింది కాబట్టి ఈ పాయింట్‌ను ఎంచుకున్నాం. ఇదే కాదు షార్ట్‌టర్మ్‌మెమోరీలాస్, స్లిట్ పర్సనాలిటీ..ఇలా గతంలో తెలుగు సినిమాల్లో చూపించిన అంశాలన్నీ జనబాహుళ్యంలో ఉన్నవే. ప్రేమకథలు, యాక్షన్ కథల కంటే ఈ కొత్త పాయింట్‌తో సినిమా చేయడం సులభమని నా నమ్మకం. కథతో కనెక్ట్ అయ్యాం కాబట్టి ఎక్కడ కష్టం అనిపించలేదు.

చందూను చూస్తే జెలసీగా ఉంది అంటూ ట్రైలర్ విడుదల వేడుకలో దర్శకుడు సుకుమార్ మీపై ప్రశంసల్ని కురిపించారు. ఆయన మాటలు వింటుంటే ఏమపినించింది?

అలాంటి అనుభవజ్ఞుడు, ప్రతిభావంతుడైన దర్శకుడు నా సినిమాను మెచ్చుకొని ప్రోత్సాహాన్ని అందించడం సంతోషంగా ఉంది. ఆయన మంచి తనానికి నిదర్శనమది.

ప్రేమమ్ తర్వాత నాగచైతన్యకు మరో కథ వినిపించారని వార్తలు వచ్చాయి?

చాణక్య అనే కథను చైతూకు చెప్పాను. వినూత్నమైన ఇతివృత్తమది. సవ్యసాచి విడుదల తర్వాత ఆ సినిమా గురించి ఆలోచిస్తాను.

కార్తికేయ సీక్వెల్ తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్నది?

సీక్వెల్ ఆలోచనైతే ఉంది. దర్శకుడిగా నాలో మరింత పరిణితి వచ్చిన తర్వాత సీక్వెల్ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం పదిహేను నిమిషాల నిడివి కలిగిన కథ సిద్ధమైంది.

లగాయితు పాటను తమన్నాపై చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆమెను తీసుకోకపోవడానికి కారణమేమైనా ఉందా?

ఈ పాటను మేము డిజైన్ చేసుకున్న విధానానికి తమన్నా సరిపోదనిపించింది. ఆమె అవసరం లేదనిపించింది. అందుకే తీసుకోలేదు. ఆమె నటిస్తే పాట మరో స్థాయిలో తప్పకుండా ఉండేది. అలాగని అవసరం లేకుండా తీసుకోవడం మంచిది కాదనుకున్నాం.

లెఫ్ట్‌హ్యాండ్ పాయింట్‌తో తమిళం, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటితో ఏమైనా పోలికలు ఉంటాయా?

ఆ సినిమాలకంటే ముందుగానే ఈ కథరాసుకున్నాను. ప్రేమమ్ సమయంలోనే నాగచైతన్యకు వినిపించాను. పోలికలు సహజం. అవని తప్పని చెప్పను. కానీ ఆ చిత్రాలకంటే భిన్నంగా ఈ కథ ఉంటుంది.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

సవ్యసాచి విడుదల తర్వాత తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను. రెండు,మూడు నిర్మాణ సంస్థలతో ఒప్పందాలున్నాయి. ఏ సినిమా ముందుగా సెట్స్‌మీదకు వెళ్తుందే చెప్పలేను.