రామాయణ ఎక్స్‌ప్రెస్

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. అందుకే దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలంతా అక్కడికి తరలివెళ్తుంటారు. కేవలం అయోధ్యను మాత్రమే దర్శించుకొని తిరుగుపయనం అవుతుంటారు. అయితే, రాముడు తన అవతారంలో అనేక ప్రదేశాల్లో సంచరించాడు. వనవాసంలో భాగంగా సీతాలక్ష్మణుల సమేతంగా, లంకలో ఉన్న సీతను తీసుకొచ్చే క్రమంలో లక్ష్మణ, వానరసేనతో కలిసి అనేక ప్రదేశాల్లో తన పవిత్రమైన పాదాల్ని మోపాడు. మరి ఆయన అడుగుపెట్టిన ఆయా ప్రదేశాలన్నీ చుట్టేస్తే , అలనాటి రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు చూసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి అనుభూతిని ప్రజలకు కల్పించేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్యాకేజీ ప్రవేశపెట్టింది. శ్రీ రామాయణ యాత్ర- శ్రీలంక పేరిట శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడుపబోతున్నది. 800 సీటింగ్ కెపాసిటీతో ప్రారంభవుతున్న ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడం ద్వారా మన దేశంలో రాముడు నడయాడిన ప్రదేశాలన్నింటినీ దర్శించుకునే వీలుంటుంది. శ్రీలంకకు కూడా వెళ్లదలిచిన వారు అదనపు చార్జీలు చెల్లించవలసి ఉంటుంది.

సందర్శించే ప్రదేశాలు

ఢిల్లీ నుంచి బయల్దేరిన తర్వాత హనుమాన్ గర్హిరామ్‌కోట్, కనక భవన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్‌వర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం ప్రాంతాలను సందర్శించవచ్చు. ప్యాకేజ్ ధర: ఒక్కొక్కరికి రూ. 15,210, శ్రీలంక వెళ్లాలనుకొనేవారు ఒక్కొక్కరూ రూ. 36, 970 చెల్లించాల్సి ఉంటుంది.

ట్రావెల్ ప్యాకేజ్

ట్రైన్ పేరు: శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ఎక్కడ మొదలవుతుంది?: సఫ్దార్‌గంజ్ రైల్వేస్టేషన్, ఢిల్లీ ఎప్పుడు మొదలవుతుంది?: నవంబర్ 14, 2018 ఎన్ని రోజుల ప్రయాణం?: 16 రోజులు ఎక్కడ ముగుస్తుంది?: రామేశ్వరం, తమిళనాడు ప్యాకేజీ సదుపాయాలు : ఇందులో భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయి. అక్కడక్కడ కొద్దిసేపు ట్రైన్‌ను నిలిపి చుట్టుపక్కల రాముడు తిరుగాడిన ప్రదేశాలనూ చూపిస్తారు.