రయ్.. రయ్ మంటూ

లాంగ్ డ్రైవ్‌లు చేయడమంటే చాలామందికి సరదా.. బైక్‌లు వేసుకొని సింగిల్ డ్రైవ్‌కి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా పెరిగిపోయింది.. మరి ఈ లిస్ట్‌లో మీరు కూడా ఉన్నారా? అయితే స్పెషల్లీ ఈ కథనం మీకోసమే.. రయ్య్‌మ్రంటూ.. ఇక్కడిక్కడే తిరిగితే ఏం లాభం.. హైవేలు ఎక్కి చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.. చల్లని గాలుల మధ్య.. నిశ్శబ్ద వాతావరణంలో తిరిగే.. బైక్ రైడర్స్ ఈ హైవే రోడ్ ట్రిప్‌లను మాత్రం మిస్‌కాకండి..

జైపూర్ - జైసల్మేర్

దూరం : 560కి.మీ. చూడాల్సిన సమయం : అక్టోబర్ నుంచి మార్చి ఈ ట్రిప్ కాస్త కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఈ ప్రయాణం గుండా వెళ్లాలనుకుంటే ఆ వాతావరణానికి తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ శాతం ఎడారి ప్రాంతంలా ఉంటుంది ఈ రూట్. మూడు మహానగరాలను తాకుతూ వెళుతుందీ రోడ్డు.

చెన్నై - పాండిచ్చేరి

దూరం : 160 కి.మీ. చూడాల్సిన సమయం: సెప్టెంబర్ నుంచి మార్చి నిశ్శబ్ద వాతావరణంలో రోడ్ ట్రిప్ చేస్తే ఎంత బాగుంటుందో కదా! అయితే చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లే దారి మీకు అనువైనది. గంటల పాటు ఒక పక్కన సముద్రపు గలగలలు తప్ప ఏం వినిపించవు. పాండిచ్చేరిలో కూడా చాలా బీచ్‌లు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాయి. సింగిల్ రోడ్ ట్రిప్ చేయాలనుకునేవాళ్లు ఈ దారిని ఎక్కువగా ఎంచుకుంటారు.

పూరీ - కోణార్క్

దూరం : 36 కిలోమీటర్లు చూడాల్సిన సమయం : సెప్టెంబర్ నుంచి మార్చి రోడ్ ట్రిప్ చేయాలనుకునేవారికి ఇది టాప్ వన్ ఆప్షన్. పూరీ దగ్గరలోని చిన్న గ్రామం తర్వాత నేషనల్ హైవే 203 మొదలవుతుంది. ఈ మార్గమధ్యంలోనే కోణార్క్ దేవాలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు. కాకపోతే ఇది సుదీర్ఘమైన హైవే మాత్రం కాదు. 36 కిలోమీటర్ల మేర మాత్రం అందమైన ప్రకృతిని ఆస్వాదించొచ్చు. ఒక పక్కన అడవి.. మరో పక్కన హిందూ మహాసముద్రపు సవ్వడిని వినొచ్చు.

గౌహతి- తవాంగ్

దూరం : 520 కిలోమీటర్లు చూడాల్సిన సమయం : మార్చి నుంచి అక్టోబర్ ఎత్తయిన కొండల మధ్యగా ఈ దారి ఉంటుంది. కొండల మీద ఆకుపచ్చని చెట్లు దర్శనమిస్తాయి. వంకలు తిరిగి ఉండే ఈ దారి గుండా ప్రయాణించడం ఒక చాలెంజ్ అని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈశాన్య భారతంలో చూడదగిన ప్రదేశంగా ఈ రోడ్‌కి మంచి పేరుంది.

విశాఖపట్నం - అరకు

దూరం : 116 కిలోమీటర్లు చూడాల్సిన సమయం : అక్టోబర్ నుంచి మార్చి ఆంధ్రప్రదేశ్‌లో చూడదగ్గ ప్రదేశం ఇది. జిడ్డుగారే విశాఖపట్నం నుంచి చల్లని గాలులు తాకే అరకు వరకు ప్రయాణం చాలా బాగుంటుంది. అడుగడుగునా పచ్చని చెట్లు మనల్ని పలుకరిస్తాయి. వంకలు తిరిగే రోడ్లు మనకు సవాల్ని విసురుతాయి. అక్కడక్కడ జలపాతాలు, చూడదగ్గ ప్రదేశాలు మనల్ని పలుకరిస్తాయి. నిజంగా మనకు దగ్గరలో ఇలాంటి ప్రదేశాన్ని మిస్ చేసుకోకండి.

మనాలి - లేహ్

దూరం : 479 కి.మీ. చూడాల్సిన సమయం: మే-అక్టోబర్ కూల్‌గా కాకుండా చాలెంజింగ్‌గా ఉండాలనుకునే వారికి ఈ ప్రయాణం బాగా నచ్చుతుంది. మనాలి నుంచి లే హైవే నుంచి ప్రయాణం అనుకున్నంత సులువు కాదు. చిన్న చిన్న ఇరుకు రోడ్లు, మట్టి రోడ్లు.. పక్కన పర్వతాలు మిమ్మల్ని కచ్చితంగా కట్టిపడేస్తాయి. నీలిరంగులు మెరిసిపోయే పాంగోంగ్ త్సో లేక్‌ని చూడడానికి రెండు కళ్లు చాలవు. కాబట్టి ఈ ప్రయాణం మీకు చాలా ఆనందాన్ని మిగులుస్తుంది.