విశాల్‌కు నేనే పెళ్లిచేస్తా!

విశాల్ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా చక్కటి స్నేహసంబంధాలున్నాయి. అంతేకాని మేమిద్దరం ప్రేమలో లేము. విశాల్‌ను నేను పెళ్లిచేసుకోవడం లేదు అని తెలిపింది వరలక్ష్మి శరత్‌కుమార్. చాలా కాలంగా విశాల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు, వారిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ పెళ్లి వార్తలను ఖండించింది వరలక్ష్మి. నేను ఎక్కడికి వెళ్లినా విశాల్‌తో మీ పెళ్లెప్పుడని అడుగుతున్నారు. నేను విశాల్‌తో డేటింగ్ చేయడం లేదు. ఓ మంచి అమ్మాయిని చూసి నేనే విశాల్‌కు పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని తెలిపింది. అలాగే భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నానని పేర్కొంది. రాజకీయాల పరంగా దివంగత జయలలితగారిని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆమె దృక్పథం నన్ను బాగా ఆకట్టుకుంది. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వెళతాను అని చెప్పింది. పాత్రల పరంగా తనకు ఎలాంటి పరిమితులు లేవని, కథానాయిక, క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్రతినాయిక.. ఇలా కథ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది. అన్ని పాత్రల్లో రాణించినప్పుడే ఏ నటికైనా గౌరవం ఉంటుందని చెప్పింది వరలక్ష్మి. తమిళంలో విజయ్ సరసన సర్కార్ సినిమాలో నటించిందామె. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది.