ముక్కు చెప్పే రహస్యం

ముక్కు మన ఆరోగ్యాన్ని శాసిస్తుందనే విషయం మీకు తెలుసా? ముక్కు వాసన సామర్థ్యం తగ్గిపోతే.. మరణానికి చేరువైనట్లే. ఈ విషయాన్ని పరిశోధించి మరీ చెబుతున్నారు. ముక్కు వాసనతోపాటు.. ముప్పును కూడా ముందే సూచిస్తుందని అంటున్నారు.

ఇక నుంచి సర్వేంద్రియానాం నాసికాం ప్రధానం అని చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే మనిషి మరణాన్ని ముందుగానే ముక్కు సూచిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి వాసన గ్రహించే శక్తిని క్రమంగా కోల్పోతున్నప్పుడు మరణం సంభవించే అవకాశాలున్నాయని అంటున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ముక్కుపై అధ్యయనాలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ముక్కు పూర్తిగా వాసనను గ్రహించకపోతే.. ఆ మనిషి ఐదేళ్లలోపే చనిపోతాడని వారు అంటున్నారు. ఏమీ లేకపోయినా, ఏదో వాసన వస్తున్నట్లు భ్రమిస్తున్నారంటే సమస్య మొదలైందని అర్థం. అది క్రమంగా మైగ్రేన్ నొప్పికి దారి తీస్తుంది. వాసన చూసే సామర్థ్యం తగ్గుతున్నట్లయితే అల్జీమర్స్ వ్యాధి ప్రారంభదశలో ఉన్నట్లు గుర్తించాలనీ అంటున్నారు. మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని అంటున్నారు. 40 నుంచి 90 యేండ్ల వయసున్న 1774 మందిపై ఈ అధ్యయనం జరిపారు. మిగతావారితో పోల్చితే వాసన గ్రహించే శక్తి పూర్తిగా తగ్గిపోయినవారు మరణించే అవకాశం ఎక్కువని తేల్చిచెప్పారు.