మిషన్ ఎస్‌ఎస్‌కే..!

మహిళలు ఏదో ఒక సందర్భంలో.. ఇంటి నుంచో బయటి నుంచో లైంగిక వేధింపులకు గురువుతుంటారు. యుక్త వయసులో ఆడపిల్లలకు ఇలాంటి వేధింపులు చాలా ఎక్కువయ్యాయని పలు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే చిన్న వయసు నుంచే మృగాళ్ల బారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ఈ ఐపీఎస్ కొత్త మిషన్‌ను ప్రారంభించింది.

వడోదరలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సరోజ్ కుమారి ఐపీఎస్ మృగాళ్ల భరతం పట్టే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, మొదట్లోనే మృగాళ్ల ఆటకట్టించేందుకు యుక్త వయసు పిల్లల కోసం ఎస్‌ఎస్‌కే (సమజ్ స్పర్ష్‌కి) మిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌లో భాగంగా చిన్నారులకు, యువతులకు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తారు. ఈ మిషన్‌లో 12 మందితో ఓ బృందాన్నే ఏర్పాటు చేసింది సరోజ్ కుమారి. వీరంతా మహిళా పోలీసులు. బ్లూ కలర్ యూనిఫామ్‌లో ప్రత్యేక దళంగా ఉంటూ లైంగిక వేధింపులకు పాల్పడేవారి ఆటకట్టిస్తున్నారు. వీరు చెప్పే అవగాహన తరగతుల వల్ల చైతన్యం పొందిన చిన్నారులు, మహిళలు తమను అసభ్యంగా తాకే కామాంధులను పట్టిస్తున్నారు. గుజరాత్‌లోని 20 స్కూళ్లకు చెందిన 2 వేల మంది విద్యార్థినులకు ఇలాంటి సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పించారు. ఈ మిషన్ ద్వారా పలు సదస్సులు నిర్వహించి బడి పిల్లలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ మిషన్‌లో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్, కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తున్నారు. స్కూల్ అయిపోయిన వెంటనే వీరి శిక్షణ మొదలవుతుంది. ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులు మరో ఐదుగురికి నేర్పించడం ఇందులో ముఖ్య ఉద్దేశం. తద్వారా ఎక్కువమందికి త్వరగా అవగాహన కల్పించవచ్చు అనేది సరోజ్‌కుమారి లక్ష్యం. సురక్ష సేతు సొసైటీస్ సహకారంతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సైగల ద్వారా కూడా వేధింపులకు పాల్పడేవారిని కూడా ఎలా పట్టించాలో నేర్పిస్తుండడంతో తమకు చాలా ఆనందంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.