మానవ సహిత వ్యోమనౌకకు సారథి!

లలితాంబిక.. ఈ పేరు ఓ స్ఫూర్తిపదం. ఎందరో యువ శాస్త్రవేత్తలకు ఈమె సేవలు ఆదర్శం. ఎందుకంటే, చాలా విషయాల్లో మహిళలను చులకనగా చూస్తున్న ఆధునికయుగంలో.. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డైరెక్టర్ కావడమే. ప్రతిభే మనిషికి ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుందనడానికి ఈ లలితాంబికే నిదర్శనం.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో కీలక లక్ష్యాలను ఛేదిస్తూ ప్రపంచ దేశాల సరసన మన దేశాన్ని నిలుపుతున్నది. తాజాగా మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా నిలుస్తుంది. ఇప్పటివరకు ఈ మూడు దేశాలే మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపాయి. అంతటి మహత్తర ప్రాజెక్ట్‌కు వి.ఆర్.లలితాంబిక డైరెక్ట్‌గా ఉన్నారు. 30 యేండ్లుగా ఇస్రోలో పనిచేస్తున్నారు లలితాంబిక.. తన సర్వీసులో ఎన్నో కీలకమైన రాకెట్ల ప్రయోగంలో తనవంతు బాధ్యతను నిర్వర్తించారు. ఇటీవల 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందానికి లలితాంబిక నాయకత్వం వహించారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. కంట్రోల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసిన లలితాంబిక 1988వ యేట ఇస్రోలో చేరారు. ప్రస్తుతం లలితాంబికతో పాటు మరో మహిళా టి.కె.అనురాధా ఇస్రోలో కీలకంగా పనిచేస్తున్నారు. రాకెట్ల ప్రయోగంలో టీం వర్క్ చాలా అవసరం. అందరి సహకారంతోనే మేం దూసుకెళ్తున్నాం. ఇస్రోలో పనిచేయడం నాకెంతో తృప్తినిస్తుందిఅని చెప్పారు లతాంబికా.