మాణిక్యాలను వెలికి తీస్తున్నది!

ఆమెకు 41 యేండ్లు. తైక్వాండోలో బ్లాక్‌బెల్డ్ సాధించింది. జీవితంలో తాను సాధించలేని విజయాలను తన శిష్యుల ద్వారా సాధిస్తున్నది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను ఎంపిక చేసి, వారిని మెరికల్లా తయారు చేస్తున్నది.

హర్యానాలోని పంచకులకు చెందిన అమిత మర్వాకు తైక్వాండో అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు సాధించాలని కలలు కనేది. ఆ దిశగా చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమించి అంతర్జాతీయ వేదికలపై దేశానికి మూడు స్వర్ణాలు, ఒక రజితం అందించింది. జాతీయ స్థాయిలో 29 పతకాలను సాధించింది. ఆ తర్వాత పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టడంతో తైక్వాండోకు విరామం ఇచ్చింది. ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించాలని ఆశయంతో.. కొన్నాళ్లకు భర్త సహకారంతో అమిత మిర్వా యాక్టివ్ సొసైటీ పేరుతో ఓ కోచింగ్ సెంటర్‌ను స్థాపించింది. అందులో పేదపిల్లలు, అట్టడుగు వర్గాలు, అణగారిన కులాలకు చెందిన వారిని ఎంపిక చేసి, ఉచితంగానే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. వారిలో తన ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఆమె వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. 2017 బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ప్రమోద్, సూరజ్‌కుమార్‌లు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. వీరే కాకుండా దాదాపు 18మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. ప్రస్తుతం 400 మంది బాలురు, 50 మంది బాలికలు అమిత దగ్గర తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 7గంటలకు వీరి శిక్షణ ముగుస్తుంది. అయితే, పలు స్థాయిల్లో రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. తన సంస్థకు ప్రభుత్వం గుర్తింపునిచ్చి, మౌలిక వసతులు కల్పిస్తే.. మరెంతోమందిని అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేస్తానని అంటున్నది అమిత.