మాటకు మూలం

మనుషులు మాటలు నేర్చుకోవడానికి మూల కారణమైన మన మెదడులోని నాడీ వ్యవస్థల సర్క్యూట్స్‌ను పోలిన వాటినే శాస్త్రవేత్తలు కోతుల మెదళ్లలో గుర్తించారు. ఈ పరిశోధనతో పరిణామ క్రమానికి చెందిన ఒక కొత్త ఆధారం లభించినట్లయిందని వారు అంటున్నారు.

మనుషులకు మాటలు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు మళ్లీ కోతులనే చూపిస్తున్నారు. కోతి నుండే మనిషి ఉద్భవించాడన్న అభిప్రాయానికి మరింత బలం చేకూర్చేలా ఇటీవల వాటి మెదడులో సమాచార బదిలీతో సంబంధమున్న నాడీ వ్యవస్థల ప్రసరణ మార్గాల (సర్క్యూట్స్)ను వారు కనుగొన్నారు. ఇవి మన మెదడులోని వాటితో పోల్చదగినవి కావడం విశేషం. న్యూయార్క్‌కు చెందిన రాక్‌ఫెల్లర్స్ లాబొరేటరీ ఆఫ్ న్యూరల్ సిస్టమ్స్‌కు చెందిన పరిశోధకులు న్యూరాన్ ఆన్‌లైన్ పత్రికలో ఈ మేరకు ఒక పరిశోధనా పత్రం ప్రచురించారు. ఈ నాడీ సర్క్యూట్స్ వల్లే మనిషి మాట్లాడే సామర్థ్యాన్ని పొందినట్టు వారు పేర్కొన్నారు. తోటివారి ముఖాలను గుర్తించడం, ముఖ కవలికలు, భావోద్వేగాల ప్రదర్శన వంటివన్నీ ఈ సర్క్యూట్స్ ద్వారానే సాధ్యమవుతున్నట్టు కూడా వారు వెల్లడించారు. రెసస్ మాకాక్యు (Rhesus macaque) జాతికి చెందిన కోతుల ఎంఆర్‌ఐ స్కానింగ్‌లలో ఈ విషయం తేలినట్లు తెలిపారు. అయితే, దీని గురించిన మరింత లోతైన అధ్యయనం అవసరమని, అప్పుడే పూర్తి నిజ నిర్ధారణ సాధ్యమనీ వారంటున్నారు.

Related Stories: