మహిళా కాటికాపరి!

మహిళలు స్మశాసం దగ్గరికి వెళ్లడమే గగనం. అలాంటిది కాటికాపరిగా చేయడమంటే ఎంత ధైర్యముండాలి. అంతకన్నా ఎక్కువ తెగువ ఉండాలి. జయలక్ష్మి కాటికాపరిగా నాలుగు వేల మందికి దహన సంస్కారాలు చేసింది. విశాఖపట్నం అనకాపల్లికి చెందిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక మహిళా కాటికాపరి. ముందు ఆమె భర్త ఈ పని చేసేవాడు. అనారోగ్యంతో అతను మరణించాడు. 2002లో జయలక్ష్మి మీద కుటుంబ బాధ్యతలు పడ్డాయి. ఇల్లు గడువాలంటే ఏదైనా పనిచేయాలి. ఏదో పని చేయడం ఎందుకు? భర్త చేసిన పనినే వారసత్వంగా తీసుకొని కాటికాపరి పనిచేయాలని నిర్ణయించుకున్నది. మహిళలు ఈ పని చేయగలరా? అని చాలామంది సందేహపడ్డారు. ఆ సందేహాన్ని జయలక్ష్మి తీసిపారేసింది. పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో మహిళలు కూడా ఏ పనినైనా చేయగలరని నిరూపించింది. ధైర్యం మగవాళ్లకే ఉంటుందన్నది ఎంత నిజమో.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరన్నది అంతే నిజమంటున్నది.