మహిళల భాగస్వామ్యమే విజయమంటున్న

సాధారణంగా ఏ కార్పొరేట్ కంపెనీని చూసినా ఉన్నత స్థానాల్లో పురుషులే ఉంటారు. సాధారణ ఉద్యోగుల్లో సైతం పురుషులతో పోల్చి చూస్తే మహిళల సంఖ్య అంతంత మాత్రమే. దీనికి ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేదు. అన్ని శాఖల్లో, కంపెనీల్లో ఇదే పరిస్థితిని మనం చూస్తుంటాం. మహిళలకు కూడా పురుషులతో సమాన అవకాశాలు ఉండాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారు సైతం తమ కంపెనీల్లో దాన్ని అమలు చేయడానికి ముందుకు రారు. కానీ ఈమె తన సంస్థలో మహిళలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. అంతేకాదు క్రియేటివిటి అనేది జెండర్‌ను బట్టి ఉండదని ఆలోచనను బట్టి ఉంటుం దంటున్న పింక్ లెమనేడ్ కంపెనీ సీఈవో టీనాగార్గ్ సక్సెస్‌మంత్ర.కంప్యూటర్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వారు ఏం చేస్తారు? ఏ ప్రొగ్రామింగ్ రంగాన్నో ఎంచుకుంటారు. కానీ టీనా మాత్రం మరో దారిని ఎంచుకున్నారు. తాను అనుకున్న రంగంలో రాణించడానికి ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతోపాటు ఒక కంపెనీని స్థాపించి మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

చదువు, ఉద్యోగం

బెంగళూరుకు చెందిన టీనా గార్గ్ ఇంజినీరింగ్ పూర్తి చేయగానే ఉద్యోగం కోసం వెతుక్కోకుండా క్రియేటివ్ రంగంవైపు అడుగులు వేశారు. క్రియేటివ్ రైటింగ్‌లో రాణించాలనే ఉద్దేశంతో తొలుత జామ్ అనే ఓ మ్యాగజైన్‌కు రైటర్‌గా పనిచేశారు టీనా. అదే సమయంలో జర్నలిజంపై అవగాహన పెంచుకోవడానికి లండన్ వెళ్లి క్రియేటివ్ రైటింగ్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో కమ్యూనికేషన్స్‌పై పని చేశారు. అక్కడ పనిచేస్తున్న నాటినుంచే అమె డిజైనింగ్ పై అవగాహన, పరిజ్ఞానం పెంచుకున్నారు. చాలాసార్లు మేం పూర్తి చేయలేనంత పని మా చేతినిండా ఉండేది. అదే నాలో ఆలోచన రేకెత్తించింది. అందుకే ఓ క్రియేటివ్ ఏజెన్సీ ప్రారంభించాలనుకున్నా అంటారు టీనా. అలా ఆమె ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే పింక్ లెమనేడ్.

టైం మేనేజ్‌మెంట్

పింక్ లెమనేడ్... కంటెంట్, కమ్యూనికేషన్స్, డిజైన్ రంగాల్లో సేవలందిస్తున్న ఏజెన్సీ. కార్పొరేట్ ఐడెంటిటీ, మార్కెటింగ్, వెబ్ సర్వీసెస్ అంశాల్లో పింక్ లెమనేడ్ పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నది. టీనా గార్గ్ సారథ్యంలోని ఈ ఏజెన్సీలో ప్రస్తుతం 25 మంది అమ్మాయిలుండగా, వారిలో 8 మందే అబ్బాయిలు. ఇతరుల వద్ద కొద్దికాలం పాటు పనిచేసిన అనుభవం నాకు ఇక్కడ బాగా ఉపయోగపడుతున్నది. ఏదైనా సాధించేవరకూ వదిలిపెట్టకపోవడం, అపజయాలకు కుంగిపోకుండా మరింత ఉత్సాహంగా పనిచేయడం.. ఇవన్నీ అక్కడి నుంచే అలవాటయ్యాయి అంటారు టీనా.

పింక్ లెమనేడ్ అంటే...

లెమనేడ్ (పానకం/పాయసం) చాలామందికి బాగా ఇష్టమైంది, తెలిసింది కూడా. కానీ ఈ పింక్ లెమనేడ్ మాత్రం కొత్తగా ఉంటుంది. కొత్త డిజైన్లు, కొత్త కంటెంట్, క్రియేటివ్స్, ఓ సరికొత్త అనుభూతి కావాలనుకునే వారందరి డెస్టినేషన్.. అన్నమాట ఈ పింక్ లెమనేడ్. మా పనితీరు అంత సృజనాత్మకంగా ఉంటుంది. మా గురించి తెలిసినవాళ్లు కచ్చితంగా తమ స్నేహితులు, భాగస్వాములు ఎంతోమందిని మా వద్దకు పంపిస్తుంటారు. ఇది చాలు.. మా ప్రత్యేకత అర్థం చేసుకోవడానికి అని ఆత్మవిశ్వాసంతో టీనా చెబుతుంటారు. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటని ఎవరైనా అడిగితే.. నేను చేసే ప్రతి పనిని ఎంతో ఇష్టంగా చేస్తా. అందువల్ల ఫలితం కూడా అనుకూలంగానే వస్తుంది. అదే మా విజయరహస్యం అని చెప్తారు.

ఎక్కువమంది మహిళలే!

పింక్ లెమనేడ్‌లో మగవారికంటే ఆడవారే ఎక్కువ. దీనికి టీనా ఏం చెప్తారంటే.. నిజం చెప్పాలంటే.. మాకు ఎక్కువమంది అమ్మాయిలను చేర్చుకోవాలనే ప్రత్యేక ఉద్దేశం ఏమీ లేదు. కాకపోతే.. మేం నిర్వహించిన పరీక్షలు, ఇంటర్వ్యూలలో వాళ్లే ఎంపికయ్యారు. మాతో చేరారు. ఆనందంగా కొనసాగుతున్నారు. వారితోగానీ, వారి పనితీరుతోగానీ ఎలాంటి సమస్యలూ లేవు. మాది విమెన్-ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్. మేమంతా ఏ విషయాన్నైనా ఓ పద్ధతిలో నిర్మాణాత్మకంగా చర్చిస్తాం. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. నేను కచ్చితంగా చెప్పగలను.. మాతో పనిచేసే వాళ్లంతా ఇష్టంతో పనిచేస్తున్నవాళ్లే తప్ప ఏదో ఒకటి చేద్దాంలే అనుకునేవాళ్లు కాదు. ఇది మాకు ఓ పెద్ద అడ్వాంటేజ్. వాళ్లందరిలో వ్యక్తిగతంగా.. ఇది మనది, వీరంతా నా వాళ్లు అనే ఓ అనుభూతి ఉంటుంది. అది కేవలం మహిళల వల్లే వస్తుంది. ఒకర్నొకరు అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ సంతోషంగా తమ విధులు నిర్వహిస్తారు. ఇది నిజంగా ఆనందించదగిన అంశమే కదా! అంటారు టీనా.

టీ-ఎల్-సీ

ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడటం అంత సులువేమీ కాదు. కానీ టీనా తమ లెమనేడ్‌లో దీన్ని సులువుగా సాధించారు. సాధారణంగా ఏ ఉద్యోగైనా టీ-ఎల్-సీ కోసం ఎదురు చూస్తాడు. అది ఇస్తే.. వాళ్లే ఉత్సాహంగా పనిచేస్తారు.. అంటారు టీనా. మరి టీ-ఎల్-సీ అంటే ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ (నమ్మకం & పారదర్శకత), లెర్నింగ్ & గ్రోత్, సెలెబ్రేషన్ & ఫన్. ఉద్యోగుల్లో నమ్మకం కలిగించాలి, జరుగుతున్న పరిణామాలన్నీ వారికి తెలియజేయాలి, వారిని కూడా సమావేశాల్లో, చర్చల్లో, నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలి, ఉద్యోగులు కొత్త అంశాలను నేర్చుకుంటూ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే సంస్థ కూడా వారి నైపుణ్యాల్ని గుర్తించి తగిన రీతిలో వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకునేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలి. పరిస్థితులను బట్టి సంస్థ లాభాల వివరాలను కూడా అందరితో పంచుకోవాలి. పనిలో ఆనందాన్ని వెతుక్కునేలా ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉండాలి. ఎంత స్వేచ్ఛ, సంతోషం ఉంటే అంత మంచి వాతావరణం ఏర్పడుతుంది అని చెబుతారామె.

మగవారు కూడా..

పింక్ లెమనేడ్‌లో పని విధానాన్ని చూసి మొదట్లో క్లయింట్లంతా ఆశ్చర్యపోయేవారు. ఇంతమంది అమ్మాయిలా? అని. కానీ, మా పని, ఫలితాలు చూసిన తర్వాత వారంతా తమ నిర్ణయాల్ని మార్చుకున్నారు. ఇంక చివరగా మా మేల్ కొలీగ్స్.. వారిని చూసి మేమంతా గర్వపడతాం. మహిళల పట్ల వారి వైఖరి, వారిచ్చే గౌరవం వారి ప్రతి కదలికలో మాకు స్పష్టంగా తెలుస్తుంది. అమ్మాయిలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు వీరంతా ఎప్పటికప్పుడు వారికి అవకాశాలిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారని చెబుతారు టీనా.

పింక్ హాలిడే..

పనిస్థలాల్లో ఎంత స్వేచ్ఛ, సంతోషం ఉంటే అంత మంచి వాతావరణం ఏర్పడుతుంది. మేం ఒక్కొక్కరికీ ఒక్కో రోజుని పింక్ హాలిడే అని ఇస్తాం. ఆ రోజు వారు డ్యూటీలో ఉన్నట్లే లెక్క. తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి సరదాగా తిరిగి, భోజనం చేసి లేదా షాపింగ్ చేసుకుని లేదా స్పాకి వెళ్లి రిఫ్రెష్ అయ్యి రావచ్చు. ఈ ఖర్చుని కూడా పింక్ లెమనేడ్ భరిస్తుంది. ఆఫీసులోనే వివిధ సందర్భాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన ఆటలు ఆడుకుంటాం. అప్పుడప్పుడూ నిర్ణీత సమయానికంటే ముందే అందరినీ ఇళ్లకు పంపేస్తాం. దీనివల్ల కుటుంబ సభ్యులతో సరదాగా ఎక్కువసేపు గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మనందరికీ ఆఫీసు, పని.. ఇవే జీవితం కాదు.. మనకంటూ ఓ కుటుంబం, వ్యక్తిగత జీవితం ఉంది. వాటికి కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వాలనేదే మా సిద్ధాంతం అని తమ వద్ద ఉద్యోగం ఎలా ఉంటుందో వివరిస్తారు టీనా.

ధైర్యంగా ముందుకు రావాలి

మహిళలు అవకాశాల కోసం తామె ముందడుగు వేయాలని చెప్తారు టీనా. సాధారణంగా మహిళలు కొంచెం సిగ్గరులు. వారు వచ్చి అడిగితే చూద్దాంలే అనుకుని వారికి అవకాశాలు కల్పించకుండా చేస్తుంటారు చాలామంది పురుషులు. అందువల్ల మనమే (అమ్మాయిలు) ధైర్యంగా ముందుకు రావాలి. ఏ పనైనా చేయడానికి మేం సిద్ధం అనే భరోసాని మేనేజ్‌మెంట్‌కి కల్పించాలి.. అని ఈతరం అమ్మాయిలకు ధైర్యం నూరిపోస్తున్నారు టీనా గార్గ్.