మన మత సామరస్యం

దేశం సర్వమత సమ్మేళనం. అన్ని మతాల మధ్య సామరస్యత కనిపిస్తుంది. హిందువులు నిర్మించిన దర్గాలు, ముస్లింలు వెళ్లే ఆలయాలు, యేసు కనిపించే హిందూ దేవాలయాలు దేశంలో మత సామరస్యతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు మతసామరస్యతకు చిరునామాగా కనిపిస్తాయి. హిందూ పండగలకు ముస్లింలు హాజరవుతారు. దర్గాలకు వెళ్లి హిందువుల సైతం పూజలు చేస్తారు. ఆలయాల గోడలపై బైబిల్ సూక్తులు, ప్రవక్తా బోధనలు, శివుని శ్లోకాలు కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రాంతాల్లో అల్లాను, శివున్ని, యేసును మతాలకతీతంగా కలిసి ఆరాధిస్తారు.

యేసు, శివుడు ఒక్కచోటే

కర్ణాటకలోని బేల్గావి ప్రాంతానికి 28 కిలోమీటర్ల దూరంలో దేశనూరు అనే గ్రామం ఉంది. ఆ ఊరి గుడిలో యేసు, శివుడు పూజలు అందుకుంటారు. అక్కడ చర్చిఫాదర్, పూజారి కూడా ఇరు మతాల వారికి సేవలందిస్తారు. ఇరువురూ మెడలో రుద్రాక్ష మాలలు, క్రాస్ సింబల్ వేసుకొని నుదుట విభూతితో కనిపిస్తారు. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చర్చిలా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లే కొద్ది హిందూ దేవాలయంలా దర్శనమిస్తుంది. అక్కడే శివలింగం, యేసు ప్రతిమ కనిపిస్తాయి. ఆ గ్రామంలోని ప్రజలు ఈ రెండు మతాల దేవుండ్లకు పూజలు చేస్తారు. 16వ శతాబ్దం నాటి నుంచి ఈ ఆలయంలో ఇలా పూజలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతారు. ఆ ఆలయాన్ని చర్చిగుడి అని పిలుస్తారు అక్కడి ప్రజలు. దీంతోపాటు సంక్రాంతి, దసర, క్రిస్మస్ వంటి పండగలను కూడా కలిసే చేసుకోవడం గమనార్హం. ఇంకా ఇతర మత వివాహాలు కూడా వీరు ఆమోదిస్తారు. ఎవరి ఇష్టమైన మతంలో వారు కొనసాగవచ్చు. మత మార్పిడి మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటారు. మతం కన్నా ప్రేమ గొప్పది, మానవత్వం గొప్పదని చెబుతారా గ్రామస్తులు.

Related Stories: