మంచి కాఫీలాంటి విజయం తేజిని కరియప్ప

చిన్నతనం నుంచీ నాటక రంగం పట్ల ఉన్న అభిమానంతో అందులోనే తన కెరీర్‌ను ప్రారంభించారామె. విదేశాల్లో స్థిరపడాలనుకున్నప్పటికీ పరిస్థితులు ఆమెను తిరిగి ఇండియాకు రప్పించాయి. లైఫ్‌ైస్టెల్ పీఆర్ కంపెనీతో వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే సమయంలో కాఫీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. వ్యాపార రంగంలో ఎదురైన సవాళ్లను అధిగమించి విజయం సాధించారు. తక్కువ సమయంలోనే తన సంస్థకు ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా గుర్తింపు సాధించారు. చిన్నగా ఎదుగడమే విజయ రహస్యమంటున్న ఎస్ట్రాడా, హళ్లిబెర్రీ సంస్థల స్థాపకురాలు తేజిని కరియప్ప సక్సెస్‌మంత్ర.

హళ్లిబెర్రీ బెంగళూరుకు చెందిన కాఫీ బ్రాండ్. దీనిని స్థాపించింది తేజిని కరియప్ప. నాటకరంగంతో కెరియర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు ఇంటర్నేషనల్ కాఫీ బ్రాండ్ ఓనర్. చిన్నవయస్సులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన కాఫీ బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వచ్చారామె.

చదువు.. కెరీర్..

తేజిని కరియప్పది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని చిక్‌మంగళూరు. ప్రాథమిక విద్య అంతా స్థానిక సోఫియా హైస్కూల్లో సాగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సబ్జెక్టుల్లో తేజిని కరియప్ప డబుల్ డిగ్రీ చేశారు.ఆ తర్వాత ఉన్నత విద్యకోసం ఆస్ట్రేలియా పయనమయ్యారు. తండ్రి చనిపోవడంతో తన తల్లికి తోడుగా ఉండడం కోసం స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. కొంతకాలం ఆరు పెద్ద థియేటర్ ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి పనిచేశారు. తరువాత ఆమె తను చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి చెందక 2013లో జాబ్ వదిలేశారు. అప్పుడే ఎస్ట్రాడా, హళ్లి బెర్రీని స్థాపించారు.

చిన్నవయస్సులోనే...

ఉద్యోగం వదిలేశాక స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుని 27 యేండ్లకే ఎస్ట్రాడా అనే స్పోర్ట్స్‌అండ్ లైఫ్ ైస్టెల్ పి.ఆర్. ఏజెన్సీని స్థాపించి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆమె మొదటి ైక్లెంట్ మాసాబ ఒక ఫ్యాషన్ డిజైనర్. మార్కెటింగ్ చూసుకోవడానికి ఎవర్నైనా నియమించాలనుకున్న ఐడియా బాగుండడంతో మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. అలా ఎస్ట్రాడా డిసెంబర్ 2013లో రూపొందించారు. నేను తక్కువగా ఉన్నా దాన్నే ఎక్కువగా ఫీల్ అవ్వడం నేర్చుకొన్నాను. ఎలా అంటే అది నా బట్టల విషయంలోనైనా, జీవితంలో నైనా, నా ఏజెన్సీలో పనిచేసే వాళ్లతోనైనా అలాగే ఉన్నాను. నీకు ఇద్దరు క్లైంట్స్ ఉన్నా పర్లేదు నువ్వు వాళ్ళతోనే ముందుకు వెళ్ళగలగాలి. మేం ఎప్పుడూ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతాం. మేము చిన్న వాళ్లమే చిన్నగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అంటారామె. ఇక్కడ అక్కడ అని తేడాలేకుండా ఎవరికైనా ఉపయోగం ఉందంటే మేము కమీషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం అంటారు. ఆమెకు క్రీడలన్నా, జీవితంలో ఫ్యాషన్‌గా ఉండడం అన్నా మక్కువ.

హళ్లి బెర్రీ

ఎస్ట్రాడా తరువాత ఆమె తల్లితో కలిసి నెస్లేడ్‌లో చిన్న కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అది చిక్‌మంగళూరు కొండల్లో వుంటుంది. వారికి పశ్చిమ కనుమలలో దట్టమైన గ్రీనరీ మధ్య బాబా బుదంగిరి కొండల్లో హళ్లి బెర్రీ అనే ఒక కాఫీ ఎస్టేట్ ఉంది. అక్కడే వాళ్ల ఇల్లు కూడా వుంది. హళ్లీ బెర్రీని తల్లి, సోదరీమణుల కోసం ఒక రాబడిగా మాత్రమే ప్రారంభించారామె. రెండు మూడు సంవత్సరాలకు ముందు కాఫీ తోట పూర్తిగా ఎండిపోయింది. అదే సమయంలో తేజిని తండ్రి మరణించాడు. అప్పటినుండి తేజిని తల్లితో కలిసి కాఫీ ఎస్టేట్లోనే ఉండేది. అది వాళ్ళకి 1900 ఏడాది నుంచి వారసత్వంగా వస్తున్నది. అందుకే తేజిని యువరక్తంతో దేనికీ జంకకుండా సామాజిక స్పృహతో దాన్ని తిరిగి మొదలు పెట్టాలనుకున్నది. హళ్లి బెర్రీని తన తండ్రి జ్ఞాపకం, తల్లి లక్ష్యంగా నెలకొల్పారు. మేం ఎస్టేట్ కాఫీని కాఫీ షాప్స్‌కు అమ్మడం మొదలుపెట్టాం. వాళ్ళు ఇష్టపడి చిన్న ప్యాక్స్ రూపంలో కావాలని అడిగారు. మాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.. మేం దీన్ని రిటైల్‌గా ఎందుకు మార్చకూడదు అని. ఆలోచన నుంచి దాన్ని ఫామ్‌గా చేశాంఅని తన ప్రస్థానాన్ని వివరించారామె.

మా తల్లిదండ్రులు, తాతముత్తాతలు కూడా పిల్లలకు చదువు చెప్పించడానికే శ్రద్ద చూపించారు. మీకు తెలియదనుకొంటాను, నేను కొంచెం అల్లరిపిల్లను. నేను ఒక పద్ధతిలో డ్రెస్సులు వేసుకోను. నేను చూడటానికి ఒక కాలేజీ అమ్మాయిలా వుంటాను. చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీరు నిజంగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారా అని. నేను ఏ దారిలో వెళ్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పుడే సవాళ్ళను అధిగమించాలి. నేను జెండర్ మూలంగా, వయసు కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. వాటిని దాటుకొని గమ్యం చేరినప్పుడే హ్యాపీగా ఉండగలం అంటూ ఒక అందమైన నవ్వు నవ్వుతారు.

ఇంతింతై..

హళ్లి బెర్రీ తొందరలోనే ఒక స్థాయికి చేరుకొంది. ఇది ఒక లగ్జరీ కాఫీ బ్రాండ్‌గానే కాకుండా మంచి టేస్ట్ కోరుకొనే వినియోగదారులకు మార్కెట్లో దొరికే ఏకైక బ్రాండ్‌గా రూపొందించారు తేజిని. రెయిన్ ఫారెస్ట్ అలయన్స్ ధ్రువీకరణ పొందిన బ్రాండ్లలో హళ్లి బెర్రీ కూడా ఒకటి. బ్రాండ్ పైన ఒక ఆకుపచ్చ కప్ప బొమ్మ వుంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన బ్రాండ్లలో హళ్లి బెర్రీ వుంది . పురుషాధిక్య త కలిగిన ఈ వ్యాపారంలో వారికి దీటుగా మహిళలందరి సహాయంతో ఎదురునిలిచి తన సత్తా చాటింది తేజిని.

ఎస్టేట్‌లో కాటేజెస్..

మాది ఇంకా యంగ్ బ్రాండ్, మాకు చాలా గొప్ప డ్రీమ్స్ ఉన్నాయి. మేం ప్రజలకోసం, వారి ఉన్నతికోసం మరిన్ని కార్యక్రమాలు చేయాలి. మా పంట సామర్థ్యం రుతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణం బాగాలేక పోతే మొత్తం పంట నష్టపోతాం. చిక్‌మంగళూరులో మేం 100 శాతం అరబిక్ మొక్కలను ఉత్పత్తి చేస్తాం. ఇవి రోబస్టా మొక్కల కంటే బలహీనమైనవి. హళ్లి బెర్రీ ఎస్టేట్ ఇటువంటి మొక్కలను సమతుల్యంగా కాపాడగలదు. తోటలను కాపాడుకొని వృద్ధి చేయాలంటే పంట రుణాలు అవసరం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మాలాంటి వారు ఇంత పెట్టుబడి పెట్టి నెట్టుకు రావడం కష్టం. అందుకే ప్రత్యామ్నాయంగా రాబడి కోసం హళ్ల్లి బెర్రీ తోటలో కాటేజెస్ నిర్మించాంఅని చెప్పారామె. చివరకు మొక్కలు పెంచే భూమిలో మరో రెండు కాటేజీలు నిర్మించారు. వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడికి ఉపయోగించుకుంటున్నారు.

స్వంతలాభం కొంత పంచి..

అందరూ ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు కానీ మనలో ప్రత్యేకత లేకపోతే సరైన గుర్తింపు ఉండదు. ప్రత్యేకత ఉండబట్టే విశాలమైన కాఫీ సామ్రాజ్యంలో హళ్లి బెర్రీ భాగం అయింది. సంస్థ పొందుతున్న లాభాల్లో నుంచి ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులకు, వారి పిల్లలకు విద్య, ఆరోగ్యంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ అందుబాటులోకి తెచ్చింది తేజిని కరియప్ప. కార్మికులకు ఉపాధి కల్పించడం మాత్రమే కాదు సమాజంలో వారికి అన్నిరకాలుగా గుర్తింపబడాలి. ఇందులో బాగంగానే కార్మికుల పిల్లలకు 13 సంవత్సరాల వరకు ఉచిత విద్యనందిస్తున్నది.