బ్రాండ్ బాజా బారాత్!

రంగురంగుల డ్రెస్సులు వేసి నలుగురిలో జిగేల్‌మనాలన్నది యూత్ గట్టిగా కోరుకునే ఓ కోరిక. దానికి తోడు బ్రాండెడ్ దుస్తులు, వస్తువుల మీద మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్రాండ్‌ల ట్రెండ్‌ను గమనించిన పలువురు సెలబ్రిటీలు తమ సొంత బ్రాండ్ దుస్తులతో యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలతో తన కంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కూడా రౌడీ పేరుతో ఓ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్‌ను ప్రారంభించాడు. దీనికంటే ముందే మార్కెట్లో పలువురు సెలబ్రిటీలు తమ బ్రాండ్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఆ ఉత్పత్తుల విశేషాల సమాహారమే ఈరోజు సింగిడి ప్రత్యేక కథనం.

రౌడి - విజయ్ దేవరకొండ

జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో విజయ్‌దేవరకొండ ఆవిష్కరించిన రౌడీ క్లాతింగ్ బ్రాండ్‌కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. తనకు నచ్చిన పనిని మొండితనంతో చేసేవాడట విజయ్. చిన్నప్పుడు విజయ్‌ని అందరూ రౌడీ అని పిలిచేవారు. ఆ రౌడీయిజం కారణంగానే నాకు నచ్చినట్టుగా నేనుంటున్నా. అందుకే నేను స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్‌కి రౌడీ అని పేరు పెట్టిన అని ప్రకటించాడు విజయ్. రౌడీక్లబ్ డాట్ ఇన్ పేరుతో వెబ్‌సైట్, యాప్ కూడా రూపొందించి ఆవిష్కరించాడు. ఇప్పటికే వేల సంఖ్యలో రౌడీ క్లాతింగ్ అమ్ముడు పోయింది.

స్కల్ట్ - షహీద్ కపూర్

స్కల్ట్ పేరుతో బాలీవుడ్ హీరో షహీద్ కపూర్ ప్రారంభించిన ఫ్యాషన్, స్పోర్ట్స్‌వేర్ బాగా సక్సెస్ అయ్యాయి. సౌకర్యంగా, ైస్టెలిష్‌గా ఉండేలా తన బ్రాండ్ రూపొందించాడు షహీద్. జాతీయ స్థాయిలో స్కల్ట్ బ్రాండ్‌కి మంచి పేరుంది.

ట్రూ బ్లూ - సచిన్ టెండుల్కర్

క్రికెట్ అంటే ఒక మతం.. సచిన్ ఒక దేవుడు అంటారు క్రికెట్ అభిమానులు. అలాంటి క్రికెట్ దేవుడు ఏదైనా వస్తువుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటేనే దాని అమ్మకాలు అమాంతం పెరిగిపోతాయి. అలాంటి వ్యక్తి తనే ఒక బ్రాండ్‌ను మార్కెట్లోకి వదిలితే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెన్స్‌వేర్, యాక్సెసరీస్‌లను ట్రూ బ్లూ పేరుతో అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో కలిసి ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేశాడు సచిన్ టెండుల్కర్.

వ్రాంగ్లర్ - జాన్ అబ్రహాం

ఫ్యాషన్ క్లాతింగ్ రంగంలో ఓ బ్రాండ్ పేరుతో అడుగుపెట్టిన తొలి ఇండియన్ సెలబ్రిటీ జాన్ అబ్రహాం. డెనిమ్, వ్రాంగ్లర్ కలెక్షన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచంలో దుమ్ము రేపాడు. తన బ్రాండింగ్‌కి జియాఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.

వ్రాగ్న్ - విరాట్ కొహ్లీ

భారత క్రికెట జట్టుకు కెప్టెన్‌గా పలు సంచలనాత్మక విజయాలు దేశానికి అందించాడు కొహ్లీ. తన ైస్టెల్, ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విరాట్‌కి ఫ్యాషన్ మీద మంచి పట్టుంది. అందుకే ఎప్పుడూ ైస్టెలిష్ లుక్‌తో కనిపిస్తుంటాడు. ఈ క్రేజ్‌తోనే వ్రాగ్న్ అనే మెన్స్ ఫ్యాషన్ బ్రాండ్‌ని ప్రారంభించాడు.

రెహసన్ - సోనమ్ కపూర్, రెహా కపూర్

రెహా కపూర్, సోనమ్ కపూర్ అనే రెండు పేర్లలోని మొదటి సగాన్ని పేరుగా పెటి తమదైన ైస్టెల్‌లో క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ చేశారు ఈ అక్కాచెల్లెళ్లు. వీథుల్లో ఫ్యాషన్ తాండవించాలి. అప్పుడే ఈ లోకం అందంగా ఉంటుంది అంటూ.. కలర్‌ఫుల్, ైస్టెలిష్ లుక్‌తో కొత్త కొత్త వెరైటీ వేరింగ్‌ని మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారు కపూర్ సిస్టర్స్. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సోనం, చెల్లలు ఫ్యాషన్‌ని ఔపోసన పట్టిన రెహాతో కలిసి రెహసన్ పేరుతో ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నది.

హెచ్‌ఆర్‌ఎక్స్ - హృతిక్ రోషన్

బాలీవుడ్ గ్రీక్‌వీరుడు అనిపించుకున్న హృతిక్ రోషన్ హెచ్‌ఆర్‌ఎక్స్ పేరుతో 2013లో ఓ ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించాడు. తేలికగా ఉండే ఫ్యాబ్రిక్‌తో దుస్తులు ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు. ఫ్యాషన్‌ట్రెండ్స్‌ని అమితంగా ఇష్టపడేవారికి హెచ్‌ఆర్‌ఎక్స్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆల్ ఎబౌట్ యు -దీపికా పడుకొనె

నటనలో తన ప్రతిభను చాటి తన ప్రత్యేకతను నిరూపించుకున్న దీపికా ఆల్ ఎబౌట్ యు పేరుతో ఒక బ్రాండ్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్ స్క్రీన్ మీద, ఆఫ్ స్క్రీన్ మీద డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే దీపిక అందరూ నాలాగే ైస్టెలిష్‌గా ఉండాలి అంటూ ఆల్ ఎబౌట్ యు ఫ్యాషన్ డ్రెస్సింగ్ వేర్ ప్రారంభించింది. మింత్రా, ఫ్రెంచ్‌కి చెందిన డిజైనింగ్ ఏజెన్సీ కార్లిన్‌లతో కలిసి కొత్త కొత్త డిజైన్లతో బట్టలు, యాక్సెసరీస్‌ని మార్కెట్లోకి వదులుతున్నది.

ఎస్‌ఎస్‌కే లైన్ - శిల్పాశెట్టి

అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న శిల్పాశెట్టి కూడా ఫ్యాషన్ బ్రాండింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2014లో ఎస్‌ఎస్‌కే లైన్ పేరుతో స్వయంగా తనే డిజైన్ చేసిన చీరలను అమ్మకానికి పెట్టింది. 2016లోనే దీన్ని మరోసారి కూడా ప్రారంభించింది. ఆకట్టుకునే ఎంబ్రాయిడరీ వర్క్‌తో శిల్పాశెట్టి మార్కెట్లోకి తెచ్చిన ఎస్‌ఎస్‌కే లైన్ చీరలు బాగా ఆదరణ పొందాయి. -ప్రవీణ్‌కుమార్ సుంకరి