బ్రహ్మపుత్రుడు!

సాహస బాలల అవార్డులు అందుకున్న పిల్లలను చూస్తే.. వారి వయసుకు వారు చేసిన సాహసానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏంటి వీళ్ల ధైర్యం అనిపిస్తుంది. కానీ.. ఆ సమయంలో వారు చూపిన తెగువ, వారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. అందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ.

ఈ ఫొటోలోని బాలుడి పేరు కమల్ కిషోర్ దాస్. వయసు పదకొండు సంవత్సరాలు. ఒకరోజు కమల్ తల్లితో కలిసి బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం ద్వారా మరో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇంతలో వారు ప్రయాణిస్తున్న బోటు ఒక బ్రిడ్జి పిల్లర్‌కు ఢీకొని రంధ్రం పడింది. బోటులోకి నీళ్లొస్తున్నాయి. బోటు మునగడం మొదలైంది. అందరూ భయంతో అరుస్తున్నారు. ఈత తెలిసిన వాళ్లు దూకి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పదకొండేళ్ల కమల్ కూడా నీళ్లలో దూకి ఈదుతూ ఒడ్డు చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో తల్లి, ఆమెతో పాటు ఉన్న తన బంధువు వస్తున్నారా ? లేదా? అని చూశాడు. వారికి ఈదడం తెలియక నీటిలో మునగడం, భయపడడం చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనక్కి మళ్లాడు. తల్లిని, మరో బంధువును ముందుకు నెడుతూ.. ఒడ్డుకు చేర్చాడు. వారి ప్రాణాలు కాపాడాడు. కమల్ వారంలో రెండు రోజులు అదే బ్రహ్మపుత్ర నదిలో స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్తాడు.

అది చూసి కమల్ తల్లి కోప్పడేది. కానీ.. ఆపద సమయంలో తనతో పాటు, ఇద్దరి ప్రాణాలు కాపాడిన కొడుకును చూసి ఆ తల్లి ఇప్పుడు గర్వపడుతున్నది. నేను వాడికి జన్మనిస్తే.. వాడు నాకు మరుజన్మనిచ్చాడు అంటూ మురిసిపోతున్నది. ఇదే విషయమై కమల్ మాట్లాడుతూ.. మా అమ్మను, ఆంటీని కాపాడగలిగాను కానీ.. ఆ పక్కనే ఇంకో ఆంటీ, చిన్న పాప నీళ్లలో మునిగిపోయారు. అప్పటికే సమయం మించిపోయింది. నేనేం చేయలేకపోయాను అంటూ బాధపడుతున్నాడు. ఏదేమైనా ఆపదలో తనను మాత్రమే కాదు.. తోటివారు కూడా ప్రాణభయంతో ఉంటారు. వారికి కూడా మన చేతనైన సాయం చేయాలన్న సందేశాన్ని చెప్పకనే చెప్పి శెభాష్ అనిపించుకున్నాడు కమల్.