బెర్లిన్ ప్రజలదే ఘనత!

బెర్లిన్ నగరం నిత్యం అతిసుందరంగా ఉండటంలో అక్కడి ప్రజలదీ కీలక పాత్రేనని వర్టెక్స్ హోమ్స్ జాయింట్ ఎండీ మురళీ మోహన్ తెలిపారు. నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో సందర్భంగా నమస్తే సంపదతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇటీవల తన బృందంతో కలిసి సందర్శించిన బెర్లిన్ నగరం విశేషాల్ని ఇలా చెప్పుకొచ్చారు.

బెర్లిన్ నగరం చూడముచ్చటగా ఉన్నది. ఆ నగరమంత పరిశుభ్రంగా ఉండటానికి అక్కడి ప్రజలదీ కీలక పాత్రేనని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. తమ నగరాన్ని అందంగా ఉంచడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరు. అంతెందుకు రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు వాహనాల్ని నడిపించడం కూడా ఎక్కడా కనబడలేదు. నడుచుకుంటూ వెళ్లేవారైనా.. కారులో వెళ్లేవారైనా.. ట్రాఫిక్ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తున్నారు. అక్కడి ప్రజా రవాణా వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉన్నది. నిర్వహణ పకడ్బందీగా ఉన్నది.

-బెర్లిన్‌లో ఆఫీసు స్పేస్ కనీస అద్దె.. చదరపు అడుక్కీ మూడు యూరోలు. అంటే, మన కరెన్సీతో పోల్చుకుంటే దాదాపు రూ.250. చారిత్రాత్మక ప్రదేశాల్లో భవనాల ఎత్తును 22 మీటర్ల వరకే అనుమతించారు. ఇతర ప్రాంతాల్లో 35 మీటర్ల దాకా అనుమతిచ్చారు. వాణిజ్య సముదాయాల్ని నిర్మించిన ప్రాంతాల్లోనే అక్కడి ప్రభుత్వం పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆయా పార్కింగ్ స్థలాల నిర్వహణ మెరుగ్గా ఉన్నది. నగరమంతా ప్రణాళికాబద్ధంగా.. కొత్త నగరంలో రహదారులన్నీ నేరుగా ఉన్నాయి. ప్రతిచోట క్రాస్ రోడ్స్ ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ సిగ్నళ్లన్నీ ప్రణాళికాబద్ధంగా, క్రాస్ రోడ్స్ మీద నిలబడే అవకాశం లేకుండా ఏర్పాటు చేశారు.

-జర్మనీ ప్రత్యేకత ఏమిటంటే.. చారిత్రాత్మక నిర్మాణాల్ని నేలమట్టం చేయరు. పైగా, వాటినే వాణిజ్య సముదాయాలుగా వినియోగిస్తున్నారు. ఆయా నిర్మాణాల ఎలివేషన్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు. ఇందుకోసం పాత ప్లాస్టర్‌ని తీసేసి.. కొత్తది వేస్తూ.. గ్లాస్ ఫసాడ్‌తో అలంకరించి.. కొత్త అందాన్ని తెస్తున్నారు. దీని వల్ల అట్టి నిర్మాణం సహజత్వాన్ని కోల్పోకుండా నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. చారిత్రాత్మక నిర్మాణాల్ని మెరుగ్గా నిర్వహించడమే బెర్లిన్ ప్రత్యేకత.