బుద్ధం శరణం గచ్ఛామి

బుద్దుడు ఎప్పుడూ కళ్లు మూసుకుని ధ్యానముద్రలోనే కనపడుతాడు. అందుకే ఆయన విగ్రహాన్ని చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అయితే ధ్యానముద్రలోనే ఉన్న పదివేల విగ్రహాలు ఒకేచోట ఉంటే.. అద్భుతంతో పాటు అధ్యాత్మికంగానూ ప్రత్యేకం అనిపించకమానదు. అలాంటి దేవాలయాన్ని చూడాలనుకుంటే చామ్‌షాన్ బౌద్ధ ఆలయం సందర్శించాల్సిందే. కెనడాలోని నయాగరా వాటర్‌ఫాల్స్‌కు సమీపంలో ఈ బౌద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రకరకాల బుద్ధ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దేవాలయంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా అందమైన బుద్ధుడి ప్రతిమలు కనిపిస్తాయి. ఒక్కో విగ్రహం ఒక్కో ప్రత్యేకతతో కనిపిస్తాయి. దేవాలయంలో ప్రధాన విగ్రహలు కూడా కొన్ని ఉన్నాయి. వీటి చుట్టూ చిన్నచిన్న గూళ్లలోనూ చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. చూడడానికి చిన్నగా అనిపించే ఈ దేవాలయం 1995లో నిర్మాణం మొదలై 2002లో పూర్తయింది. నయాగరా జలపాతాన్ని దర్శించడానికి వచ్చే పర్యాటకుల్లో చాలామంది చామ్‌షాన్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.