బాలీవుడ్‌లో కలల ప్రయాణం

ఏ భాషా కథానాయికలైనా బాలీవుడ్‌లో వెలిగిపోవాలని కలలు కంటారు. జాతీయస్థాయిలో ఉన్న గుర్తింపు దృష్ట్యా హిందీ చిత్రసీమ ప్రతి ఒక్కరిని ఊరిస్తూనే ఉంటుంది. అందుకే దక్షిణాదిన మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న కథానాయికలు కూడా బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తారు. కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ బాలీవుడ్ ప్రయత్నాల్ని మాత్రం వీడరు. అటు దక్షిణాదిన, అటు హిందీ చిత్రసీమలో సమాంతరంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని తాపత్రయపడతారు. రకుల్‌ప్రీత్‌సింగ్, తమన్నా, శృతిహాసన్‌తో పాటు పలువురు కథానాయికలు హిందీలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ బాలీవుడ్ కలల్ని మాత్రం వదిలిపెట్టడం లేదు.

తెలుగు చిత్రసీమ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టి విజయాల్ని సొంతం చేసుకున్న నవతరం కథానాయికల్లో తాప్సీ ఒకరు. టాలీవుడ్‌లో మంచి అవకాశాలే అందుకున్నా అవేవీ ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. గ్లామర్ పాత్రలకే పరిమితమనే ముద్రను సొంతం చేసుకుంది. అపై బాలీవుడ్ బాట పట్టింది ఈ పంజాబీ సొగసరి. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నీరజ్‌పాండే దర్శకత్వంలో రూపొందిన బేబీ చిత్రం ఆమెలోని ప్రతిభను చాటిచెప్పింది. అభినయనప్రధాన పాత్రలకు తాప్సీ న్యాయం చేయగలదని ఈ చిత్రం నిరూపించింది. బేబీ తర్వాత హిందీ చిత్రసీమలో బిజీగా మారిపోయిందామె. పింక్ చిత్రంలో మినల్ అరోరా నేరారోపణలు ఎదుర్కొంటున్న నిరపరాధిగా తాప్సీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. జుద్వా-2, నామ్ షబానా, సూర్మా, ముల్క్, మన్‌మర్జియాన్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో అలరించింది. ప్రస్తుతం తఢ్కా, బద్లా, బారీష్ అవుర్ చౌమెన్ చిత్రాల్లో నటిస్తూ జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్‌లో దూసుకుపోతున్నది.
తమన్నా కెరీర్ హిందీ సినిమాలతోనే ప్రారంభమైంది. 2005లో విడుదలైన చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీడేస్‌తో తెలుగులో తొలి సక్సెస్‌ను అందుకున్న ఆమె అనతికాలంలో అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హిమ్మత్‌వాలా (2008) సినిమాతో బాలీవుడ్‌లో పునరాగమనం చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన హిందీ చిత్రాలు హమ్‌షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు కూడా తమన్నాకు నిరాశనే మిగిల్చాయి. బాలీవుడ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకోవాలనే కల మాత్రం నెరవేరలేదు. ప్రస్తుతం చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఖామోషీ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుందీ మిల్కీ బ్యూటీ. ఈ చిత్రంలో మూగ, చెవిటి యువతిగా తమన్నా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే జోరు కొనసాగుతుంది. తెలుగు సినిమాలపై దృష్టిసారిస్తూనే బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నది. హిందీలో పూజా హెగ్డే నటించిన చారిత్రక చిత్రం మొహంజోదారో ఆమెకు చేదు ఫలితాన్నే మిగిల్చింది. హృతిక్‌రోషన్ కథానాయకుడిగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం పాలైంది. దాంతో రెండేళ్ల పాటు హిందీ సినిమాలకు దూరమైన పూజా హెగ్డే తాజాగా హౌస్‌ఫుల్-4తో పునరాగమనం చేయబోతున్నది. జయాపజయాలకు అతీతంగా తెలుగు చిత్రసీమలో నంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందింది రకుల్‌ప్రీత్‌సింగ్. బాలీవుడ్‌లో మాత్రం ఈ సుందరి సక్సెస్ ఖాతాను ఇంకా తెరవలేదు. ఆమె నటించిన హిందీ చిత్రాలు యారియాన్, అయ్యారీ పరాజయాలుగానే మిగిలాయి. ప్రస్తుతం అజయ్‌దేవ్‌గన్‌తో దే దే ప్యార్ దే అనే సినిమా చేస్తున్నది రకుల్‌ప్రీత్‌సింగ్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై కొన్ని పోరాట ఘట్టాలుంటాయని తెలిసింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో శుభారంభాన్ని అందుకోవడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది రకుల్‌ప్రీత్‌సింగ్.
ఈ ఏడాది ఎక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాతో రెజీనా హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్రలో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా అంఖేన్ సీక్వెల్‌లో రెజీనాకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోవాలనే శృతిహాసన్ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో విజయాలు అందుకున్న ఆమె బాలీవుడ్‌లో సక్సెస్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దిల్ తో బచ్చా హైజీ, డీడే, గబ్బర్ ఈజ్ బ్యాక్, రాకీ హ్యాండ్‌సమ్‌తో పాటు హిందీలో పలు సినిమాలు చేసింది శృతిహాసన్. వెల్ కమ్ బ్యాక్ మినహా ఈ సినిమాలన్నీ పరాజయాలుగానే నిలిచాయి. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం మహేష్‌మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో సక్సెస్ అందుకోవడం ఖాయమని అంటోన్నది శృతిహాసన్.

ప్రయోగాలు, విలక్షణ తరహా పాత్రలతో దక్షిణాదిన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నిత్యామీనన్. తాజాగా ఆమె ప్రాణ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నది. ఏక పాత్రతో కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతున్నది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వీకే ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దక్షిణాది సినిమాల్లో విజయాలు ఉన్నప్పటికి మన కథానాయికలు బాలీవుడ్ కలల్ని మాత్రం వదులుకోవడం లేదు.