బిడ్డను పోగొట్టుకొని..

అది 2017 డిసెంబర్ నెల.. అమరావతికి చెందిన ఉమేష్, అశ్వినీ సావర్కర్ దంపతులు ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డ ప్రమాదమయింది. వారితో పాటు మూడు నెలలపాప మీరా కూడా గాయపడింది.
ఉమేష్ చాకచక్యంగా దగ్గర్లోని పిల్లల ఆసుపత్రికి మీరాను తీసుకెళ్లాడు. సీటీ స్కాన్‌లో మీరా తలకు బలమై బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదముందని చెప్పారు. కన్నప్రేమను కోల్పోవడం ఇష్టం లేక నాగ్‌పూర్‌లోని సెంట్రల ఇండియా చిల్డ్రన్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి తీసుకెళ్లారు. తమ బిడ్డ వయసున్న చిన్నారులకు ఎవరికైనా అవయవాలు అవసరమైతే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలా అయినా తమ బిడ్డను ఆ పసివారిలో చూసుకోవాలనుకున్నారు. కానీ విధి మరోలా ఆలోచించింది. వారికి సహకరించలేదు. ఫలితం వారి బిడ్డ దక్కలేదు. చూస్తూ.. చూస్తూ బిడ్డ తమ కండ్లముందే శ్వాస విడువడం వారు తట్టుకోలేకపోయారు. మరో నాలుగు రోజులు అదనంగా వెంటిలెటర్ ద్వారా తమ బిడ్డ శ్వాస తీసుకోవడం చూడాలనుకున్నారు. ఇంతలో.. ఓ పేదింట్లో పుట్టిన పాప గుండె ఆపరేషన్ కోసం వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని తెలిసింది. వెంటనే స్పందించారు. ఆ ఆ పాపకు తమ సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు. మరో అబ్బాయికి కూడా గుండె ఆపరేషన్ చేయించారు. కొడిగడుతున్న రెండు చిరుదీపాలను తమ అరచేతులు అడ్డుపెట్టి కాపాడగలిగారు. కానీ.. తమ ఇంటి దీపాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు.