బాధితులకు బాసటగా..

వరదల్లో నిండా మునిగిన కేరళ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉన్నది. కరెంటు లేక తమ క్షేమ సమాచారం తమ వారికి తెలుపాలంటే ఫోన్లు చాలా ముఖ్యం. ఈ సందర్భంలో పవర్ బ్యాంకులు తయారుచేస్తున్నారు త్రివేండ్రం ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ అత్యంత అవసరమైన వస్తువుగా మారిపోయింది. ఆపద సమయాల్లో అయితే.. చేతిలో మొబైల్ లేకపోతే ఏం తోచదు. అంబులెన్స్‌కో, బంధువులకో, ఫ్రెండ్స్‌కో ఫోన్ చేసి సహాయం తీసుకోవాలంటే ఫోన్ ఉండాలి. మరి కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి? కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లే లేని పరిస్థితి. ఇక కరెంట్ ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో తమ క్షేమ సమాచారం తమ వారికి ఫోన్‌లో చెప్పాలంటే ఎలా? ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కేరళలోని త్రివేండ్రం ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. కేరళ వరద బాధితుల కోసం మినీ పవర్‌బ్యాంకులు తయారుచేశారు. వాటిని బాధితుల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎనిమిది ఏఏ బ్యాటరీలు, రెండు క్యాటరిడ్జ్‌లతో ఈ పవర్‌బ్యాంకులు తయారుచేశారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న కేరళ వరద బాధితులకు ఈ పవర్‌బ్యాంకులు చాలా ఉపయోగపడనున్నాయి. ఇప్పటికి 300 పవర్‌బ్యాంకులు తయారుచేసి వరద బాధితులకు పంచారు. మరిన్ని తయారుచేసి బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వారి ఫోన్లు అందుబాటులో ఉండడానికి ఈ పవర్‌బ్యాంకులు చక్కగా ఉపయోగపడుతున్నాయి.