ఫిషింగ్ మెయిల్స్ తెరవొద్దు

పతి ఒక్కరి ఈమెయిల్ ఐడీకి ఏదో సందర్భంలో ఫిషింగ్ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని చూడగానే గుర్తుపట్టేస్తారు. మరికొంతమంది తెలియక వాటిని ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతుంటారు. మరి ఫిషింగ్ మెయిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకొని, ఇకనైనా జాగ్రత్త పడండి.

మెయిల్‌లో ఉండే కొన్ని పదాలను చూస్తే.. అది ఫిషింగ్ మెయిలా ? కాదా? అన్నది వెంటనే గుర్తు పట్టేయొచ్చు. అవేంటో అర్థంకావడం లేదంటారా? అయితే, Add me, Join network, Reset Password, New Massege వంటి పదాలతో ఫిషింగ్ మెయిల్స్ మొదలవుతాయి. మీ మెయిల్స్‌లో ఇలాంటి పదాలున్న ఈమెయిల్స్‌ను ఓపెన్ చేయకపోవడమే చాలా ఉత్తమం. A delivery was made అనే సబ్జెక్ట్‌తో వచ్చేవి అత్యధికంగా ఫిషింగ్ మెయిల్సే. UPS label delivery అనే సబ్జెక్ట్‌తో వచ్చే ఈమెయిల్స్.. ఫిషింగ్ మెయిల్స్‌లో రెండోస్థానంలో ఉన్నాయి. ఫిషింగ్ మెయిల్స్‌లో సోషల్ మీడియా పేరిట వచ్చే వాటిల్లో లింక్డిన్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు బిఫోర్ అనే సంస్థ తన రిపోర్ట్‌లో ప్రకటించింది. తర్వాతి స్థానంలో మోటోరోలా, ఫ్రీ పిజ్జా, న్యూ వాయిస్ మెసెజ్ వంటి పేర్లతో ఫిషింగ్ మెయిల్స్ వస్తున్నట్లు గుర్తించింది. అందుకే, ఇలాంటి పేర్లతో, గుర్తు తెలియని మెయిల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకపోవడమే మంచిదని పై నివేదిక చెబుతున్నది. లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీకు లాటరీ తగిలిందనీ, కారు గెల్చుకున్నారని, బంగారం గెలుపొందారని, బ్రిటన్ లాటరీ వచ్చిందనీ అని చెప్పి చాలామంది అమాయకులను దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకే తస్మాత్ జాగ్రత్త.