ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలె

టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేండ్లలో తాము సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించింది. నివేదన సభలో అదే విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే సభ అనంతరం కొంతమంది ఆ సభపై విమర్శలు చేయడం సరికాదు. తాజాగా శాసనసభను రద్దుచేసి ప్రజల వద్దకు వెళ్తున్నది. మొన్నటిదాకా ఈ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైంది అని విమర్శించిన వాళ్లు ఇప్పుడు సభను ఎందుకు రద్దు చేశారో చెప్పాలనడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి కూడా తాము తీసుకున్న నిర్ణయం సరైందో కాదో ప్రజలే తేలుస్తారని చెప్పారు. కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం మొదలుపెట్టినా అది ఆచరణలోకి రాకముందే ఆధారాల్లేని అవినీతి ఆరోపణలు చేసి అభాసుపాలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వచ్చిన ఏ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్షాలు గెలుచుకోలేకపోయా యి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఆధారాలు నిరూపించాలి. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి. కానీ ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తూ కేవలం ముఖ్యమంత్రి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలి. ఎందుకంటే వాళ్లంతా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అన్న విషయాన్ని మరిచి కొందరు ఒక్క కుటుంబంలోనే నాలుగు ఉద్యోగాలు దక్కాయననడం శోచనీయం. వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్న పార్టీల్లో ఉంటూ వారసత్వ రాజకీయాల గురిం చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అంతేగాని తమకు అధికారం దక్కలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కూడా ఆదరించరని అర్థం చేసుకోవాలి. - బోనాల అనిల్, కొండాపూర్, కరీంనగర్