శుభలేఖల మహత్తు

సమకాలీన పరిస్థితులకు దర్పణంలా ఉండే చిత్రమిది. నేటితరం యువత ఆలోచనధోరణులు ఎలా ఉంటున్నాయో వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపిస్తున్నాం. మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పే అర్థవంతమైన సినిమా ఇది అని అన్నారు శరత్ నర్వాడే. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం శుభలేఖ లు. సాయిశ్రీనివాస్, ప్రియా వడ్లమాని, దీక్షాశర్మ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. విద్యాసాగర్, జనార్ధన్.ఆర్.ఆర్ నిర్మాతలు. పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ మంచి కథను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేశాం. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. డిసెంబర్ 7న సినిమాను విడుదలచేస్తాం అని తెలిపారు. బెల్లంరామకృష్ణరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. కథ, పాత్రలతో ప్రతి ఒక్కరు మమేకమవుతారు. నాయకానాయికలు కాకుండా తెరపై కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇదే టీమ్‌తో మా పుష్యమి సంస్థ ద్వారా ఓ సినిమా చేస్తాను అని తెలిపారు.

సుదీర్ఘ విరామం తర్వాత మంచి సినిమాకు స్వరాలను అందించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని కె.ఎం. రాధాకృష్ణన్ చెప్పారు. తమ జీవితాల్లోని మధురానుభూతులను తిరిగి ప్రతి ఒక్కరికి జ్ఞప్తికి తెచ్చే మంచి సినిమా ఇదని హీరో అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు సాయిశ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిగాయి. ప్రియావడ్లమాని, మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Stories: