ప్రకృతికి ఆహ్వానం

ఒకప్పుడు పూల తోటలు.. పూల కుండీలు ఇంటి బయటే ఉండేవి. ఇప్పుడు అవే పూల కుండీలు, పూల మొక్కలు డైరెక్ట్‌గా బెడ్ రూంలోకే వచ్చేస్తున్నాయి. ఇంట్లోనే ఎదురుగా కనబడేలా పూల మొక్కలను పెంచుకునేందుకు ఇటీవల పట్టణాలలోని అపార్ట్‌మెంట్ వాసులు ఆసక్తి చూపుతున్నారు.

పూలను ఇంట్లో అందంగా అలంకరించడానికి ఇటీవల ఆదరణ బాగా పెరుగుతున్నది. కొన్నేళ్ల క్రితం పూల మొక్కలు, చెట్లు ఇంటి ఆవరణలో గానీ, పెరళ్లలోగానీ ఉండేవి. ఇప్పుడు అవి ఏకంగా పడుకునే గదుల్లోనూ, కూర్చునే హాళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల కలర్‌ఫుల్‌గా కనిపించడంతోపాటు, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని మానసిక వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా బాల్కనీ, బెడ్ రూమ్‌లలో రంగురంగుల పూలు కనబడే విధంగానే కాకుండా ముదురు రంగుల పూలకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో వరండా, హాళ్లు, పడక గదులలో కలర్‌ఫుల్ ఇంటీరియర్స్‌కు ప్రాధాన్యమిచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు బ్యూటీ లవర్స్. చూసీ చూడగానే కళ్లకు నిండుగా కనబడేలా పువ్వులను సర్దేస్తున్నారు. అంతేకాకుండా గదులలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని పూల మొక్కలతోనూ, పూల చెట్లతోనూ అలంకరించుకొని ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎక్కువగా ఉండే మొక్కలు, చెట్లను తమ ఇళ్లలోపల ఏర్పాటు చేసుకొని అందంగా తీర్చి దిద్దుకుంటున్నారు.