పైపుల్లో కలల పొదరిండ్లు

ఇప్పటి వరకూ ఇండ్లను నిర్మించడంలో మనం చాలానే అద్భుతాలు చూశాం. నీటిపైన తేలియాడే ఇండ్లు, కృత్రిమ దీవులను సృష్టించి అక్కడ నిర్మాణాలు, సముద్రం లోపల, కొండలపైన కట్టిన ఇండ్లనూ చూశాం. కానీ, కాంక్రీట్ పైప్‌లో ఇండ్లను ఎప్పుడైనా చూశారా? డ్రెయినేజీ పైపుల్లో ఆధునిక ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఇండ్లను ఊహించారా? హాంకాంగ్‌లో ఇలాంటి ఇండ్లు కనిపిస్తాయి. అవసరం ఆలోచనకు మూలం. ఆ ఆలోచనలకు కొన్ని ఘటనలు ఉత్ప్రేరకంగా మారి కొత్త ఆవిష్కరణలు, అద్భుతాలు జరుగుతాయి. హాంకాంగ్ చిన్న దేశం. జనాభా ఎక్కువ. మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న ఇండస్ట్రీలు వెరసీ అక్కడ ఇంటి అద్దెలూ పెరుగుతూ ఉంటాయి. కొత్త ఇల్లు నిర్మించడానికి అక్కడ సరిపడా జాగ లేదు. అందుకే అక్కడ బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఎక్కువ. అద్దెకు తీసుకోవడం అంటే డబ్బులు ధారబోయాల్సిందే. మధ్యతరగతికి చెందిన చాలామందికి సరైన గృహనివాసం లేదు. అక్కడక్కడ బోన్లలో ఉండి జీవనం సాగిస్తారు. ఆ ఇండ్లను కాఫీన్, కేజ్‌లు అంటారు. ఒక బోనుపై మరో బోను ఇలా ఉంటాయి. అదే వారికి ఇల్లు. దానికి నెలకు రూ.30 వేల అద్దె చెల్లిస్తారంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జీవించేందుకు చోటు దొరకని అత్యంత కష్టమైన దేశాలలో హాంకాంగ్ మొదటిది. డెమోగ్రాఫియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ దేశం ఈ స్థానంలో నిలువడం వరుసగా ఇది ఎనిమిదో సారి.

పరిష్కారం..

హాంకాంగ్‌లో నివాస సమస్యకు పరిష్కారం కోసం చాలానే ప్రయోగాలు జరిగాయి. మైక్రోహౌస్‌లు నిర్మించి ఆవాసం ఏర్పాటు చేసుకోవడం అక్కడ కల్చర్‌గా మారింది. ఈ మెక్రోహౌస్‌ల కంటే తక్కువ ధరలో ఇండ్లను నిర్మించాలని ఓపాడ్ అనే నిర్మాణ సంస్థ ఆలోచించింది. దాని వ్యవస్థాపకుడు జేమ్స్‌లా ఒకరోజు రోడ్డుమీద వెళ్తూ ఉంటే కాంక్రీట్‌తో చేసిన పైపులు కనిపించాయి. 2.5 మీటర్ల పొడవు, మూడున్నర అడుగుల వ్యాసార్థంతో ఆ పైపులు ఉన్నాయి. దాన్ని చూసిన జేమ్స్‌కు ఫ్లాష్ ఆలోచన వచ్చింది. పైపులో ఖాళీ స్థలాన్ని పరిశీలించాడు. ఇద్దరు నివసించడానికి అనువైన స్థలంగా భావించాడు. అంతే ఆధునిక టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌తో ఓపాడ్ పేరుతో దాన్ని ఇళ్లుగా మార్చేశాడు. రెండువైపులా గ్లాస్ డోర్లు, లోపల కిచెన్, బెడ్డు, కంప్యూటర్ టేబుల్, మైక్రోఫ్రిజ్, టాయిలెట్, షవర్ అన్నింటినీ ఏర్పాటు చేశాడు. లోపలికి వెళ్లగానే కూర్చోవడానికి ఒక బెంచీ, ఇతర సామాగ్రి పెట్టుకోవడానికి టేబుల్ ఉంటాయి. వంగిన గోడలు, ఫర్నీచర్, సరిపడా ఫ్లోర్ స్పేస్ అనుకూలంగా ఉంటుంది. లోపలా, బయట ఉష్ణోగ్రత సరిపడా ఉంటుంది. దీంతో పాటు అవసరమైనప్పుడు ఈ పైప్‌ను ట్రక్కుల మీద ఇతర ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇలాంటి ఓపాడ్ ఇండ్లకు హాంకాంగ్‌లో డిమాండ్ ఉంది. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో నివాసయోగ్యమైన ఈ గృహాలపై అక్కడి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. హాంకాంగ్‌లో ఇండ్ల నిర్మాణ సంస్థలు ఓపాడ్ ఇండ్లను చూసి ఆశ్చర్యపడ్డాయి. చదువుకునే యువత, ఉద్యోగులు ఈ ఓపాడ్ ఇండ్లలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు. హైవేల పక్కన, అపార్ట్‌మెంట్‌ల సందుల్లో వీటిని పెట్టుకోవచ్చు. ఈ మెక్రో హౌస్‌లు రానున్న రోజుల్లో హాంకాంగ్ యువతకు సరికొత్త జీవన విధానం అవుతుందని జేమ్స్‌లా అంటున్నాడు. అక్కడ ఇండ్ల నిర్మాణంలో వాడుతున్న టెక్నాలజీ, విధానాలు, ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నాయి. ఇండ్లు కట్టడానికి సరిపడా స్థలం లేకపోవడం వల్ల అక్కడి ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కృత్రిమ దీవిని ఏర్పాటు చేసి అక్కడ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది. 2500 ఎకరాల్లో 4 లక్షల ఇండ్లను నిర్మించి అందులో 80 శాతం సాధారణ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నది. 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. 2030 నాటికి హాంకాంగ్‌వాసుల కష్టాలు తీరుతాయట.
More