పేద పిల్లల భవిష్యత్ కోసం!

కరణం మల్లేశ్వరి, దీపా కర్మాకర్, హిమదాస్.. వీరంతా అట్టడుగు వర్గాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారే. వారి ప్రతిభతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వారి బాటలోనే పయనిస్తూ.. పేద పిల్లల క్రీడా భవిష్యత్ కోసం కష్టపడుతున్నది ఈ భీమా బాయి.

తమిళనాడులోని వ్యసర్పది గ్రామానికి చెందిన భీమా బాయి ప్రతిభగల ఫుట్‌బాల్ క్రీడాకారిణి. షెడ్యూల్డ్ కులానికి చెందిన భీమాబాయ్‌కి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. పాఠశాలలో మగవారితో కలిసి పోటీపడి ఆడేది. ఈ క్రమంలో ఆమె దళితురాలంటూ ఉన్నత వర్గానికి చెందిన పిల్లలూ, పెద్దలు హేళన చేసేవారు. ఈ క్రమంలో చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్‌వై)అనే ఎన్జీఓ భీమాబాయి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడి ఈ ఏడాది అశోక యూత్ వెంచర్ అవార్డు అందుకున్నది. దీంతో తాను ఉండే ఏరియాకు సీఆర్‌వై బాధ్యతలను అప్పజెప్పారు ఆ సంస్థ ప్రతినిధులు. సీఆర్‌వై మొదట్లో చెన్నైలో ప్రారంభమై కేవలం నాలుగేండ్లలోనే బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో శాఖలను విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థలో 850మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలోని 23 రాష్ర్టాల్లో 20 లక్షల మందికి పైగా పిల్లలు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వ్యసర్పది ఏరియాలో ఈ ఏడాదికి సంబంధించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ భీమాబాయి నేతృత్వంలో త్వరలోనే జరుగనున్నది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా ఎంతో అవసరమని, అందుకోసమే పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తన వంతుగా కృషి చేస్తున్నానని చెబుతున్నది భీమాబాయి. సాకర్‌లో మన వాళ్ల ప్రాతినిధ్యమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నది.