పేదింటి బంగారం

తిండిలేని రోజులెన్నో గడిపింది. తల్లిదండ్రుల కష్టం చూసి, దాబాల్లో పనిచేసింది. కారణం, ఏదో సాధించాలనే కసి, పట్టుదల. అవే ఆమెను కబడ్డీ వైపు నడిపించాయి. ఆటలో మెళుకువలు నేర్పించాయి. దేశం తరఫున పోరాడి బంగారం సాధించేలా చేశాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మానాలీకి చెందిన పృథ్వీ సింగ్, కృష్ణదేవిల చిన్న కూతురు కవిత చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జాతీయ కబడ్డీ జట్టులో చోటు సంపాదించింది. దేశం తరఫున ఆటల్లో పాల్గొని బంగారు పతకాలను సాధించింది. కష్టాల కడలిని కసి, పట్టుదలతో దాటి.. కొత్త బంగారు లోకంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో దేశం తరఫున ఆడబోతున్నది కవిత. అక్క కల్పనతో కలిసి కవిత చిన్నప్పటి నుంచి కుటుంబం గడువడానికి తండ్రితోపాటు టీ దుకాణాన్ని నడిపారు. వాటితో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దాబాల్లో పనిచేశారు. ఈ క్రమంలో పృథ్వీసింగ్ కూడా చిన్న దాబా పెట్టడంతో వాటి నిర్వహణ, పనులు, వంటలు అన్నీ వీరే చూసుకొనేవారు. అలా రాత్రిళ్లు దాబాల్లో పనులు చేస్తూనే, పగలు స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకునేవారు. ఈ క్రమంలో స్కూల్‌లో జరిగే కబడ్డీ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చూపించేది కవిత. ఇలా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిల్లో తనదైన ప్రతిభ చూపింది. కబడ్డీ పూర్తిస్థాయిలో ఆడేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినట్లు దాబాలోనే పనిచేసేది. చివరికి కవిత ఇష్టాన్ని అర్థం చేసుకొని ధర్మశాలలోని ఇండియా స్పోర్ట్స్ అథారిటీలో చేర్పించారు. అలా రాష్ట్రస్థాయి కబడ్డీలో తనదైన ముద్రవేసి జాతీయ స్థాయికి ఎదిగింది. అప్పటినుంచి కవిత వెనుదిరిగి చూసే పరిస్థితి రాలేదు. 2012లో జరిగిన కబడ్డీ టోర్నమెంట్‌లో చాంపియన్‌షిప్‌ని దక్కించుకుంది. 2014, 2017లో కూడా మహిళా కబడ్డీ జట్టు గెలుపులో కీలకపాత్ర వహించింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించనున్నది. దాబాల్లో పనిచేసే స్థితి నుంచి దేశానికి బంగారు పతకం అందించే స్థాయికి వచ్చింది కవిత.