పార్ట్‌టైమ్ వాచ్‌మెన్.. ఫుల్‌టైమ్ ఆర్టిస్ట్!

మనం ఏం పనిచేస్తామన్నది కాదు.. చేసేపనిలో ఎంత నిబద్ధతగా ఉన్నామన్నది ముఖ్యం. వాచ్‌మెన్‌గా ఉంటున్న ఓ వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదిగి రెండు పనుల్లోనూ నిబద్ధతను కనబరుస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటున్నాడు.

పుయా.. బెంగళూరు వాసి. చిక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకసారి అదే మెట్రో స్టేషన్‌లో కొంతమంది కళాకారులు పెయింటింగ్స్ వేశారు. ఇతను మాత్రం దగ్గరలోని ఒక షెడ్‌లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులంతా పుయా పెయింటింగ్స్ చూసి ఆశ్చర్యపోయారు. న్యూస్‌పేపర్‌లోని ఒక మోడల్ బొమ్మను అచ్చుగుద్దినట్టు గీశాడు. అది చూసి ఆ ఆర్టిస్టులు అతనికి పెయింటింగ్స్‌లో మెళకువలు నేర్పించారు. తనతోనే ఆ మెట్రోస్టేషన్‌కి అందమైన రంగులను అద్దించారు. ఇది జరిగి సంవత్సరం దాటింది. ఇప్పుడు ప్రముఖ కంపెనీలు అతనికి ఫుల్‌టైమ్ ఆర్టిస్ట్ చాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బెంగళూరు సిటీనే అందంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో పుయాని భాగస్వామిని చేయాలనుకుంటున్నాయి ఆయా కంపెనీలు. అదే కనుక జరిగితే వాచ్‌మెన్‌గా పనిచేసే పుయా.. అద్భుతమైన కళాకారుడిగా మారిపోతాడు. మరెన్నో అద్భుతాలకు సృష్టికర్త అవుతాడు.