పాపడాల బామ్మ!

కుటుంబం కోసం కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేస్తుందీ బామ్మ. నలభై సంవత్సరాలుగా పాపడాలు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఇప్పుడు ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వసుమతి అమ్మ.. కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటుంది. చిన్నప్పుడే పెండ్లి అయ్యింది. పిల్లలు పుట్టారు. నలభై సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు. దీంతో తనతో పాటు మరో ఏడుగురి బాధ్యత ఆమె నెత్తిన పడింది. తనకు వచ్చింది కేవలం వంట చేయడమే. అందుకే దాన్నే ప్రధాన వనరుగా మార్చి సంపాదించాలనుకుంది. పాపడాలు తయారు చేసి రోడ్డు పక్కన లేదా తన ఊరిలోని మార్కెట్‌లో పెట్టి వాటిని అమ్మడం మొదలుపెట్టింది. మొదటి నుంచి పిండి పట్టించే దగ్గర నుంచి వాటిని తయారుచేసి, ఎండపెట్టడం, అమ్మడం అన్నీ వసుమతి అమ్మే చూసుకునేది, ఇప్పటికీ చూసుకుంటున్నది. 87 యేండ్ల వయసులో కూడా ఇప్పటికీ ఈ బామ్మ పాపడాలు చేయడం మాత్రం ఆపడం లేదు. పిల్లలు చేతికి వస్తే ఏముంది.. నాకు శక్తి ఉన్నంతవరకు పనిచేసే బతుకుతా అని చెబుతున్నదీ బామ్మ. 25 పాపడాలు ఉన్న ఒక ప్యాకెట్‌ని 20 రూపాయలకు అమ్ముతూ.. పాపడాల బామ్మ, పాపడాల గ్రానీ అంటూ పిలిపించుకుంటున్నది. సోషల్‌మీడియాలో బిజూస్ అనే వ్యక్తి ఈమెకు సంబంధించిన స్టోరీ, ఫొటోని పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఈమెకు సెల్యూట్ చేస్తున్నమంటూ నెటిజన్లు ఈమె స్టోరీని షేర్ చేస్తున్నారు.

Related Stories: