హస్తసాముద్రికం

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కేకే రాధాకృష్ణ (జిల్ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకుడు. పూజా హేగ్డే కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్నది. ఇదిలావుండగా ఈ సినిమా కథకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్ట్టుకుంటున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 1970 దశకానికి, నేటి కాలానికి అనుసంధానంగా సాగే పిరియాడిక్ కథాంశమిదని తెలుస్తున్నది. డెభ్భైదశకం నేపథ్యంలో సాగే కథలో ప్రభాస్ పామిస్ట్ (హస్తసాముద్రికుడు) పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆనాటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించేలా ఇటలీలో వేసిన భారీ సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా కీలకమైన పాత్రను పోషించబోతున్నారని తెలుస్తున్నది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీతం: అమిత్‌త్రివేది, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: గోపీకృష్ణా మూవీస్, దర్శకత్వం: కేకే రాధాకృష్ణకుమార్.