న్యాచురోపతినే నమ్ముకున్నది!

వాళ్లింట్లో ఏడుగురు సంతానంలో ఈమె ఐదవది. తండ్రి వ్యవసాయం చేసేవాడు. చిన్నప్పుడు పేదరికాన్ని అనుభవిస్తూనే కష్టపడి చదువుకున్నది. అప్పుడంతా నువ్వేం చేస్తావులే అని హేళన చేసిన వారే.. ఇప్పుడు ఆమె చేస్తున్న అద్భుత వైద్యం గురించి తెలిసి లెంపలేసుకుంటున్నారు.

మణిపూర్‌కు చెందిన రుకామణి చిన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించింది. అయినా, వాటిని లెక్కచేయకుండా చదివింది. ఆమె ఇంఫాల్‌లో బీఎస్సీ చదువుతున్నప్పుడు మూడు నెలలకు పైగా జబ్బున పడింది. తెలిసిన వారి ద్వారా న్యాచురోపతి వైద్యంతో త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలుసుకుంది. దక్షణాది రాష్ర్టాలకు వచ్చి న్యాచురోపతి వైద్యంతో ఆరోగ్యం మెరుగుపర్చుకున్నది. అప్పటి నుంచి ఆ వైద్యంపై ఆసక్తి పెంచుకున్న రుకామణి.. ఓ రోగిని మానసికంగా, శారీరకంగా ఎలా ఆరోగ్యవంతుడ్ని చెయ్యొచ్చో తెలుసుకున్నది. హైదరాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని మణిపూర్‌లో న్యాచురోపతి వైద్యాన్ని ప్రారంభించింది. అక్కడ డాక్టర్ నాయర్‌ను పెండ్లి చేసుకొని ఢిల్లీకి వెళ్లింది. దేశ రాజధానిలో భర్త సహకారంతో న్యాచురోపతి సెంటర్‌ను ప్రారంభించింది.

అందులో సామాన్యుల నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరికీ వైద్యం చేసింది. కొన్నాళ్లకు సీజీహెచ్‌ఎస్ అండ్ డీజీహెచ్‌ఎస్ న్యాచురోపతి హాస్పిటల్‌గా రిజిస్ట్రేషన్ చేయించి, 50 పడకలతో వైద్యాన్ని అందిస్తున్నది. అంతేకాకుండా, ఆ ఆస్పత్రిలో యోగా కూడా నేర్పిస్తున్నది. ఇలా అనతికాలంలోనే అందరి మన్ననలు పొందుతూ.. న్యాచురోపతి వైద్యాన్ని నమ్ముకున్నది రుకామణి. ప్రకృతిసిద్ధ ఆయుర్వేద వైద్యాల్లో న్యాచురోపతి ఒకటి. దీంట్లో రోగిని మామూలు స్థితికి తీసుకోచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, నచ్చిన రంగంలో ఇష్టంతో పనిచేస్తేనే గుర్తింపు వస్తుంది అని చెబుతన్నది రుకామణి.