సినిమాలు చూసిన అనుభవంతో..

చిన్నా సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు మాకు లేవు. మంచి సినిమా చేయడానికే ప్రాధాన్యతనిస్తాం అని చెబుతున్నారు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి (సీవీఎమ్). శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్రాలతో నిర్మాతలుగా హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వారు నిర్మించిన తాజా చిత్రం సవ్యసాచి. నాగచైతన్య కథానాయకుడు. నవంబర్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు మిత్రులు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

పెద్ద సినిమాలు తీయాలనే ఇండస్ట్రీకి వచ్చాం. ప్రస్తుతం చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలు మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి. మా సంస్థ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో సవ్యసాచి రూపొందించాం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చందూ మొండేటి రాసిన కథ బాగుంది. ఈ పాయింట్‌కు భావోద్వేగాలు, వినోదాన్ని మిళితం చేసి సినిమాను అద్భుతంగా రూపొందించారు. మాధవన్ తెలుగులో నటించిన తొలి సినిమా ఇది. చైతూ, మాధవన్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. దాదాపు ఇరవై నాలుగేళ్లుగా మా ముగ్గురి మధ్య స్నేహం కొనసాగుతున్నది. సినిమాలు చూసిన అనుభవంతోనే నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాం. కథల్ని విని సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ప్రతిరోజు సెట్స్‌కు వెళ్లి చిత్రీకరణ జరుగుతున్న తీరును పరిశీలిస్తాం. నిర్మాతలుగా అది మా బాధ్యత. దర్శకులను నమ్మి ప్రయాణం సాగిస్తున్నాం.

నానితో అనుకున్నాం కానీ

పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తాం. రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన మా సంస్థలో నటిస్తారనే నమ్మకం ఉంది. మేమిచ్చిన అడ్వాన్స్ పవన్‌కల్యాణ్ తిరిగి ఇచ్చారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుంది.త్రివిక్రమ్ నిర్ణయాన్ని అనుసరించి అందులో హీరో ఎవరనేది చెబుతాం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రలహరి సినిమాను తొలుత నానితో చేయాలనుకున్నాం. అలాంటి ప్రేమకథలతో గతంలో నాని సినిమాలు చేయడంతో కుదరలేదు. సాయిధరమ్‌తేజ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. చిత్రలహరి కథ ఆయనకు నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మరో సినిమాను నిర్మిస్తున్నాం. రంగస్థలం చిత్రానికి రచనా విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రారంభమవుతుంది.

వేసవిలో షురూ

మహేష్‌బాబు, సుకుమార్ కలయికలో రూపొందనున్న సినిమాను వచ్చే ఏడాది వేసవిలో సెట్స్‌పైకి తీసుకొస్తాం. ప్రస్తుతం సుకుమార్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. రవితేజ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం నవంబర్ నెలాఖరున ప్రారంభమవుతుంది. తమిళ చిత్రం తేరి మూలకథను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తొలుత ఇదే కథతో పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. దాంతో పవన్‌కల్యాణ్ అనుమతితో రవితేజ శైలికి అనుగుణంగా కథలో మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. కోటి రూపాయల బడ్జెట్‌లో నూతన తారాగణంతో మరో సినిమా చేస్తున్నాం. ప్రస్తుతం పూర్వనిర్మాణ పనులు జరుగుతున్నాయి. రితేష్ ఈ సినిమాతోదర్శకుడిగా పరిచయం కానున్నారు. అమెజాన్ వారి కోసం ఓ వెబ్‌సిరీస్ రూపొందించే ఆలోచనలో ఉన్నాం.