నీటిపై తేలుతూ..

అప్పుడప్పుడు పడవల్లో నీటిపై ప్రయాణం చేస్తేనే మనసు ఎంతో ఆహ్లదకరంగా అనిపిస్తుంది. అదే సరస్సు లోనే గ్రామం ఉంటే..? వినడానికే ఎంతో ముచ్చటేస్తుంది కదూ!

మయన్మార్‌లోని షాన్ పర్వతాలకు సమీపంలో ఇన్‌లే అనే సరస్సు ఉంది. దీని విస్తీర్ణం 116 చదరపు కిలోమీటర్లు. ఇది పెద్ద విషయమేం కాదు. కానీ ఈ సరస్సుపై ఏకంగా నాలుగు చిన్న పట్టణాలు, కొన్ని గ్రామాలూ ఉన్నాయి. వీటిలో సుమారు 70వేలమంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు నీటిపైనే ఇండ్లు, దేవాలయాలు, పాఠశాలలు ఇలా అన్నీ నిర్మించుకున్నారు. అంతేకాదు ఈ సరస్సులోనే వెదురు బొంగులతో చిన్న చిన్న మడులు కట్టి వ్యవసాయమూ చేస్తున్నారు. ఇక్కడి వారి జీవనాధారం చేపల వేట. సరస్సులోనే చేపలు పట్టి జీవిస్తుంటారు. ఇంకా వీరి ప్రయాణం, మార్కెట్లూ అన్నీ పడవల్లోనే సాగుతాయి. ఈ వింత నగరాలను చూడడానికి దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో వారికి వసతులు కల్పించడం కోసం సరస్సులో ఏకంగా రిసార్టులు వెలిశాయి.