నీటిపైన నివాసం

నీటిపైన విహరించడం అంటే చాలామందికి ఇష్టం. అయితే అది ఎప్పుడో ఒకసారి ఏ బోట్‌లోనో అయితే పర్వాలేదు. కానీ జీవితాంతం నీటిపైనే ఉండాల్సి వస్తే..కష్టం అనుకుంటున్నారా? నీటిపైన ఒక ఊరే ఉంటే?ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ! అయితే మన దేశంలోకాదు బ్రూనైలో..

బోర్నియో ద్వీపకల్పంలో ఉన్న ఒక చిన్న దేశం బ్రూనై దారుస్సలాం. ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. ఇక్కడే వాటర్ విలేజ్ అని పిలువబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేలమంది ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో కంపోంగ్ ఐర్ అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని, ఐర్ అంటే నీరు అని అర్థం.