నాట్య భావన!

కూచిపూడి నాట్యరంగంలో శిఖరాలు.. రాజారాధారెడ్డి.. కౌసల్యారెడ్డి.. నిత్యవిద్యార్థులుగా ఇప్పటికే శ్రమిస్తూనే ఉన్నారు.. వారి వారసురాలిగా నాట్యరంగంలో అరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది భావనారెడ్డి.అటు సంగీతంలోనూ.. ఇటు సాహిత్యంలోనూ అడుగువేసి.. అందరితో మన్ననలనూ అందుకుంటున్నది.. ఇటీవలే.. సంగీత నాటక అకాడమీ నుంచి..బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాన్ని అందుకున్నది.. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ..

తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు.. వారి అడుగుజాడల్లో వెళితే మనకు కావాల్సిన ఎంట్రీ దొరుకుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం వారిని మరిపించే శ్రమ చేయాల్సిందే! ఇది ఎలాంటి కెరీర్‌లో ఉన్నా సరే వర్తిస్తుంది. కూచిపూడి నాట్య రంగంలో మన తెలంగాణ దంపతులు రాజారాధా రెడ్డి.. కౌసల్యా దేవి రెండవ కుమార్తె భావన. మొదటి కూతురు యామిని కూడా కూచిపూడి డ్యాన్సరే! ఇంట్లో ఇంతమంది కళాకారుల మధ్య పెరిగింది. కానీ వారిని అనుకరించినట్టు ఎక్కడా కనిపించదు. హావభావాల్లోనూ.. భంగిమల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నది భావన. అందుకే అతి పిన్న వయసులోనే ఎన్నో అవార్డులు, రివార్డులు, స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌లు ఇస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నది. అటు శాస్త్రీయ సంగీతం, పాప్ మ్యూజిక్‌లతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నది.

ఇల్లే నాట్యాలయం

రాజారాధారెడ్డి.. కౌసల్యారెడ్డి.. కలిసి ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడిలో వీరి పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నిజామాబాద్ వాస్తవ్యులైన వీళ్లు ఢిల్లీలో స్థిరపడ్డారు. భావన అక్కడే పుట్టి, పెరిగింది. ఇంట్లో ఎప్పుడూ నాట్యం, సంగీతాల గురించే ఎక్కువ ప్రస్తావనలొచ్చేవి. మృదంగం, గాయనీ గాయకులు.. ఇలా ఎంతోమంది వాళ్లింట్లోనే ఉండేవాళ్లు. దాంతో చిన్న ప్రాయంలోనే భావనకు నృత్యం మీద మక్కువ ఏర్పడింది. నాలుగేండ్ల వయసులో కాలికి గజ్జె కట్టి నృత్యాన్ని అభ్యసించింది. అటు చదువు, ఇటు నృత్యం ఇలా కొనసాగుతూనే ఉండేవి. నాట్యం కంటే ముందుగానే ఆమె సంగీతంలో ప్రవేశించిందని చెప్పాలి. భావన రెండున్నరేండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు తల్లి, అక్క కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకునేవారు. వారితో పాటు భావన కూడా వెనుక కూర్చొని శ్రద్ధగా ఆ సంగీతాన్ని శ్రుతి తప్పకుండా నేర్చుకున్నది.

ఆదిగురువులు..

భావన నాట్యాన్ని అభ్యసించడానికి పెద్దగా ప్రయాస పడలేదు. ఇంట్లో అమ్మానాన్నలే తన తొలి గురువులుగా మారి నృత్యాన్ని నేర్పించారు. వారితో పాటు పద్మసుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసే వర్క్‌షాపుల్లోనూ పాల్గొని నాట్యంలోని మెళకువలను అభ్యసించింది. అలా తల్లిదండ్రులతో పాటు ఎన్నో స్టేజ్‌లను పంచుకున్నది. ఈ మధ్య కాలంలో సోలో పర్‌ఫార్మెన్స్‌లు కూడా ఇస్తూ తనదైన శైలిని అందరికీ పరిచయం చేసింది. భావన ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదువుకుంది. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బికామ్ హానర్స్ పూర్తి చేసింది. అయితే.. నృత్యం, గానం అంటూ ఇటు వైపే కాదు.. చదువులోనూ మంచి మార్కులతోనే పాసయ్యేది. వారంలో మూడు రోజులు సంగీతం, మూడు రోజులు నాట్యానికి సమయం కేటాయించేది. తల్లిదండ్రులే గురువులు కావడంతో.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. అందుకే సంగీతం లేకున్నా ఉంటుందేమో కానీ.. ఒక్క రోజు నృత్యం చేయకుండా మాత్రం ఉండదట. నృత్యం తనకు మంచి రిలాక్సేషన్ అని ఆమె అంటున్నది.

పరిశీలన.. పరిశోధన..

మనిషిలో ఏకాగ్రతను పెంచేందుకు.. మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు నృత్యం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నిజమంటున్నది భావన. అందుకే నాన్నతో పాటు నృత్యరీతిలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నది. ఢిల్లీలో రాజారాధా రెడ్డి స్థాపించిన నాట్య తరంగిణిలో విద్యార్థులకు నృత్యరీతులను నేర్పిస్తున్నది. అంతేకాదు.. దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్యానికి సంబంధించిన ఎన్నో వర్క్‌షాపులను కూడా నిర్వహిస్తున్నది. దీనివల్ల యువతలో నృత్యం పట్ల ఆసక్తి పెరుగుతుందనేది ఆమె వాదన. యువత ముందడుగు వేస్తేనే ఏ కళ అయినా బతుకుతుందంటున్నది. సోలోగా కూడా మరిన్ని పర్‌ఫార్మెన్స్‌లకు సిద్ధమవుతున్నది.

నాట్యమే ప్రాణం

నేను పెరిగిందంతా ఢిల్లీలో కాబట్టి నాకు పెద్దగా తెలుగు రాదు. కానీ మా ఇంట్లో పనిచేసేవాళ్లు.. ఇతర కళాకారులు తెలుగువాళ్లు ఉండేవాళ్లు. అలా కొంచెం కొంచెం తెలుగు వచ్చు. చిన్నప్పటి నుంచి తీరిక లేకుండా ఉండడంతో పెద్దగా సమయం దొరుకలేదు. కానీ ఏ కొద్ది సమయం దొరికినా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, నిద్రపోవడం చేస్తుంటా. సినిమాలు తక్కువ చూస్తాను. చూసినంత వరకు ప్రభాస్, అనుష్క అంటే ఇష్టం. నాకు బ్యాడ్మింటన్, టెన్నిస్ అంటే ఇష్టం. అందుకే వాటిలోనూ అడుగుపెట్టా. కానీ దాంట్లో ఎలాంటి అచీవ్‌మెంట్స్ అయితే చేయలేదు. హైదరాబాద్ వస్తే బిర్యానీ టేస్ట్ చేయకుండా ఉండను. ఎక్కువ తింటే డ్యాన్స్‌కి కష్టమని ఈ మధ్య డైటింగ్ మొదలుపెట్టా. ఎన్ని కళల్లో నేను ప్రావీణ్యం పొందినా.. నాట్యాన్ని మించి నా జీవితంలో వేరే వాటికి అంత స్థానం ఇవ్వలేదు, ఇవ్వను కూడా. కూచిపూడిలో నేనెప్పుడు నిత్యవిద్యార్థినిలా ఫీలవుతా. అమ్మానాన్నలు మరింత గర్వపడేలా చేసి తీరుతా. - భావనారెడ్డి

హాలీవుడ్‌లో అడుగు..

సంప్రదాయ నృత్యరీతులను అభ్యసిస్తున్నప్పుడు సంగీత పరిజ్ఞానం ఎంతోకొంత ఉంటుంది. భావనకి కూడా ఆ జ్ఞానం చిన్నప్పుడే అబ్బింది. అటు శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా.. ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టు తనని తాను మలుచుకోవాలనుకున్నది. స్టేజ్‌షోలు ఇవ్వడానికి విదేశాలకు వెళుతుండేది. అప్పుడు వెస్ట్రన్ పాటలపై ఆసక్తి పెరిగింది. సందర్భానుసారంగా వాళ్లు పాటలు కట్టి పాడడం ఆమెను కట్టి పడేసింది. అందుకే కాలిఫోర్నియాలోని హాలీవుడ్ ఇనిస్టిట్యూట్ నుంచి వోకల్, ఇండిపెండెంట్ ఆర్టిస్టరీలో మాస్టర్ డిగ్రీని పొందింది. గిటార్ కూడా బాగా వాయించగలదు. అలా.. పాటల్లో తనదైన ప్రస్థానం మొదలైంది. తనే సొంతంగా రాసి.. మ్యూజిక్‌ని అందించి పాడింది. అది మెచ్చిన ఒక స్నేహితుడి జాయ్ రైడ్ -3 అనే హాలీవుడ్ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. అలా పాపులర్ పాప్ సింగర్‌గానూ పేరు సంపాదించింది. సౌమ్య నాగపురి